అనైతిక బంధానికి అడ్డొస్తున్నాడనే..

7 Sep, 2019 10:23 IST|Sakshi

ప్రియుడితో కలసి భర్తను హత్య చేయించిన భార్య

నిందితులను రిమాండ్‌కు తరలించిన పోలీసులు

ఐదు సెల్‌ఫోన్లు, నగదు స్వాధీనం

సాక్షి, పటాన్‌చెరు: ప్రియుడుతో కలసి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయించిన ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ రాజేశ్వర్‌రావు, సీఐ నరేష్‌ వివరాలను వెల్లడించారు. మెదక్‌ జిల్లా పుల్కల్‌ మండలం ముదిమానిక్యం గ్రామానికి చెందిన బేగరి దివాకర్‌ 15 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం కుటుంబ సభ్యులతో కలసి పటాన్‌చెరు చైతన్యనగర్‌ కాలనీలో నివాసం ఉంటూ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా  జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల ఆగస్టు 26న మండల పరిధిలోని పెద్దకంజర్ల గ్రామ శివారులోని ఎల్లమ్మ గుడి సమీపంలో దివాకర్‌ (39) హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ రాజేశ్వర్‌ రావు, సీఐ నరేష్‌ 

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం శేరిగూడెం గ్రామానికి చెందిన మైలారం జంగయ్యకు కొన్ని రోజుల క్రితం దివాకర్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో వీరి పరిచయం స్నేహంగా మారడంతో దివాకర్‌ అవసరాల కోసం అప్పుడుప్పుడు జంగయ్య వద్ద డబ్బులు తీసుకునేవాడు. ఈ క్రమంలో జంగయ్య తరుచూ దివాకర్‌ ఇంటికి వచ్చిపోతుండే వాడు. ఈ క్రమంలో దివాకర్‌ భార్య సురేఖతో జంగయ్యకు పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధంగా మారింది. జంగయ్యపై దివాకర్‌కు అనుమానం వచ్చిందని దివాకర్‌ భార్య సురేఖ జంగయ్యతో చెప్పింది.

దీంతో ప్రణాళిక వేసిన జంగయ్య తన స్నేహితుడైన నవాపేట్‌ మండలం పులుమామిడి గ్రామానికి చెందిన ఆకుల పరమేష్, మాదారం గ్రామానికి చెందిన ప్రకాష్‌ను సంప్రదించాడు. దివాకర్‌ను హత్య చేసేందుకు రెండు లక్షల సుపారి మాట్లాడి రూ. లక్షా 30 వేలను అడ్వాన్స్‌గా ఇచ్చాడు. ఈ క్రమంలో ఆగస్టు 26న పథకం ప్రకారం పరమేష్, ప్రకాష్‌లు ఇద్దరు దివాకర్‌కు మద్యం తాగించి మండల పరిధిలోని పెద్దకంజర్ల గ్రామ శివారులో శివానగర్‌ వైపు వెళ్లే రోడ్డులో గల ఎల్లమ్మ గుడి సమీపంలో దివాకర్‌ను రాయితో తలపై కొట్టి హత్య చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు హత్యకు కారణమైన జంగయ్య, పరమేష్, ప్రకాష్, దివాకర్‌ భార్య సురేఖను అదుపులోకి తీసుకొని నలుగురిని రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ. 13 వేల నాలుగు వందలు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా