హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు

24 Sep, 2019 13:00 IST|Sakshi
నిందితులు సునీత, శ్రీనివాస్‌

తమ్ముడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

పోస్టుమార్టం నివేదికతో వెలుగులోకి..

నిందితుల అరెస్ట్‌

గచ్చిబౌలి: అస్తమాతో బాధపడుతున్న తన భర్త ఆయాసం తట్టుకోలేక యాసిడ్‌ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే మృతుడి గొంతుపై గాయాలు ఉండటంతో  రాయదుర్గం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టు మార్టం నివేధికలో హత్యగా తేలడంతో  అక్కా తమ్ముడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. తరచూ తాగి వచ్చి వేధింపులకు గురి చేస్తుండటంతో భరించలేక హత్య చేసినట్లు వెల్లడించారు. రాయదుర్గం సీఐ రవీందర్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.  మధురానగర్‌కు చెందిన నూనె నర్సింహులు(43), సునీత దంపతులు కూలీలుగా పని చేస్తూ జీవనం సాగించేవారు.

ఈ నెల 20న అస్తమాతో బాధపడుతూ తన భర్త నర్సింహులు యాసిడ్‌ తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు సునీత రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. గొంతుపై  గాయాలు ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదికలో గొంతుకు తాడు బిగించి హత్య చేసినట్లుగా వెల్లడికావడంతో సునీతను అదుపులోకి తీసుకొని విచారించారు. తాగుడుకు బానిసైన నర్సింహులు తరచూ తనను వేధించే వాడని తెలిపింది. ఈ నెల 20న ఉదయం భార్యతో గొడవపడి  బయటికి వెళ్లిన నర్సింహులు మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీంతో సునీత పథకం ప్రకారం తన తమ్ముడు సాదుల శ్రీనివాస్‌తో కలిసి అతడిపై దాడి చేసింది. సంపు వద్ద నిలబడి ఉన్న నర్సింహులు తలపై కర్రతో మోదింది. అనంతరం ఇద్దరూ కలిసి   నైలాన్‌ తాడుతో నర్సింహులు గొంతుకు ఉరి బిగించి హత్య చేశారు. అనంతరం ఇంట్లో పడుకోబెట్టి నోట్లో  యాసిడ్‌ పోశారు. అస్తమాతో బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులను నమ్మించారు. పోస్ట్‌ మార్టం నివేదికలో నిజం వెల్లడికావడంతో కటకటాలపాలయ్యారు. నిందితులను సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా