లారీ కింద తోసేసి...ప్రమాదంగా చిత్రీకరించి!

4 Jun, 2018 12:14 IST|Sakshi
హతుడి భార్య, బావమర్ది అరెస్ట్‌ను చూపుతున్న పోలీసులు

ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం హత్య

భార్య, బావమర్దే సూత్రధారులు

నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

పరారీలో మరో ముగ్గురు

కర్నూలు: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం చోలవీడు గ్రామానికి చెందిన శ్రీనివాసులు హత్యకేసు మిస్టరీని ఓర్వకల్లు పోలీసులు చేధించారు. ఈ ఏడాది జనవరి 25వ తేదీన ఓర్వకల్లు సమీపంలోని బేతంచెర్ల రహదారిలో శ్రీనివాసులును పథకం ప్రకారం లారీ కింద తోసి హత్య చేసి పరారయ్యారు. ముందుగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఓర్వకల్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో వాస్తవా లు వెలుగు చూడటంతో హత్యకేసుగా మార్చి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అరవీటి రమేష్, మృతుని భార్య రమాదేవి హైదరాబాద్‌ నుంచి కర్నూలుకు వస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు సుంకేసుల రోడ్డులోని వై జంక్షన్‌ వద్ద కర్నూలు రూరల్‌ సీఐ పవన్‌కిషోర్, ఓర్వకల్లు ఎస్‌ఐ మధుసూదనరావు తమ సిబ్బందితో కాపుకాసి వారిని అదుపులోకి తీసుకొన్నారు. పోలీసుల విచారణలో ఆశ్చర్యపో యే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

రూ. కోటిన్నరకు ఇన్సూరెన్స్‌  
శ్రీనివాసులుకు అదే జిల్లా కృష్ణంశెట్టి పల్లెకు చెందిన రమాదేవితో 23 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి  కుమారుడు, కుమార్తె సంతానం. చోలవీడు గ్రామానికి చెందిన మధుతో కలసి రమాదేవి సోదరుడు అరవీటి రమేష్‌ హైదరాబాద్‌లో ఆయిల్‌ వ్యాపారం నిర్వహించేవాడు. శ్రీనివాసులు వారి వద్ద గుమాస్తాగా పని చేసేశాడు. ఈ  క్రమంలో రమాదేవితో మధు వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. విషయం శ్రీనివాసులకు తెలిసి అతనితో ఘర్షణ పడ్డాడు. అప్పటి నుంచి శ్రీనివాసులను అంతమొందించాలని అన్నాచెల్లెలు కలసి కుట్ర పన్నారు. అలాగే 2015 సంవత్సరంలో బజాజ్‌ అలవెన్స్, టాటా ఇన్సూరెన్స్, మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో సుమారు కోటిన్నర రూపాయలకు ఇన్సూరెన్స్‌ చేయించి ఒక్కొక్క కంతు చెల్లించారు.  ఆ మొత్తాన్ని కాజేసేందుకు పథకం వేశారు.

క్షేత్రాల సందర్శనకు తీసుకొచ్చి..
శ్రీనివాసులను అంతమొందించేందుకు క్షేత్రాల సందర్శన పేరుతో కుట్ర పన్నారు. రమాదేవి, అరవీటి రమేష్‌ మరి కొంత మందితో చోలవీడు నుంచి బయల్దేరి జనవరి 23వ తేదీన రాత్రి మహానందికి చేరుకున్నారు. 24వ తేదీ కర్నూలుకు చేరుకొని రాత్రి ఎస్వీ రెసిడెన్సీలో బస చేసి 25వ తేదీ ఉదయం యాగంటి దేవస్థానానికి అంటూ బయల్దేరి ఓర్వకల్లు శివారుల్లోని బేతంచెర్ల రోడ్డులో ఉన్న చెన్నంశెట్టి పల్లె వద్ద లారీ కింద తోసి హత్య చేసి లారీ ప్రమాదం కింద చిత్రీకరించినట్లు విచారణలో బయటపడింది. నిందితుల నుంచి హత్యకు కుట్రలో భాగమైన మృతునిపై ఉన్న ఇన్సూరెన్స్‌ పాలసీ డాక్యుమెంట్లు, టీఎస్‌07ఎఫ్‌యూ3919 స్కోడా కారును సీజ్‌ చేశారు. నిందితులను ఆదివారం కర్నూలు డీఎస్పీ ఖాదర్‌బాషా ఎదుట హాజరు పరిచి వివరాలను వెల్లడించారు. ఇదే కేసులో ఏ5, ఏ6 నిందితులైన యాసిన్, రమణను మార్చి నెలలోనే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ వెల్లడించారు. రమాదేవి ప్రియుడు మధుతోపాటు మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. వారి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.

మరిన్ని వార్తలు