తరచూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతోందని..

15 Oct, 2019 05:01 IST|Sakshi

భార్యను రోకలిబండతో బాదిన భర్త

అక్కడికక్కడే మృతి చెందిన మహిళ

రాజేంద్రనగర్‌: సెల్‌ఫోన్‌ భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టింది. తరచూ ఫోన్‌లో మాట్లాడుతోందని భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, ఆమెను అంతమొందించాడు. ఈ ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. వికారాబాద్‌ జిల్లా కులకచర్ల మండలం విఠలాపురం ప్రాంతానికి చెందిన శాంతయ్య, సున్నాల శ్రీదేవి (30) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఇటీవలే సన్‌సిటీ ప్రాంతంలోని ఓ ఇంటిలో శాంతయ్య వాచ్‌మెన్‌గా పనిలోకి చేరగా.. శ్రీదేవి ఆ ఇంటి పనులు చూసుకుంటోంది. అయితే, శ్రీదేవి తరచుగా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండడంతో శాంతయ్య ఆమెను మందలించాడు. ఇదే విషయమై సోమవారం ఉదయం ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఆవేశం పట్టలేని శాంతయ్య, శ్రీదేవి తలపై రోకలి బండతో బలంగా బాదాడు. దీంతో శ్రీదేవి అక్కడికక్కడే కుప్పకూలింది. స్థానికుల సహాయంతో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతిచెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు