హత్య కేసులో ఏడుగురు నిందితులు అరెస్టు

28 Sep, 2018 13:16 IST|Sakshi
అరెస్టు అయిన నిందితులు

కట్టెలు, సెల్‌ఫోన్, ఆటో స్వాధీనం

ఆత్మహత్యగా చిత్రీకరించేప్రయత్నం

48 గంటల్లో నిందితులను అరెస్టు చేసిన వైనం

మీడియాతో కడప డీఎస్పీ షేక్‌ మాసుంబాషా

కడప అర్బన్‌ : జీవితాంతం తోడు నీడగా ఉండే భర్తను తన తల్లిదండ్రులు, బంధువులతో కలిసి కట్టుకున్న భార్యే హత్య చేయించింది. ఆత్మహత్యగా చిత్రీకరించి సంఘటనను పక్కదారి పట్టించేం దుకు ప్రయత్నించారు. ఈ సంఘటనను పోలీసులు ఛేదించి ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. కడప రూరల్‌ సర్కిల్‌లో చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్‌ పరిధిలో ఈనెల 24వ తేదీ రాత్రి ఊటుకూరు మజరా ఏఎల్‌ కాలనీలో నివసిస్తున్న చిత్తూరు జిల్లా మదనపల్లె టౌన్‌ నక్కలదిన్నె తాం డాకు చెందిన బుక్యా రవీంద్రనాయక్‌ ఊటుకూరు ప్రాంతంలోని సునీత, మురళినాయక్‌ల కుమార్తెను నాలుగున్నర సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు.

వీరికి ఇద్దరు సంతానం కలిగారు. వివాహమైనప్పటి నుంచి రవీంద్రనాయక్‌ ఇల్లరికం అల్లుడిగానే అత్తగారింట్లోనే కాపురం ఉంటున్నాడు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. మురళి నాయక్‌ బంధువు హరి నాయక్‌తో హతుని భార్య రేఖారాణి వివాహేతర సంబంధం కలిగి ఉంది. ఈ విషయం తెలిసిన రవీంద్రనాయక్‌ పలుమార్లు తన భార్యను మందలించాడు. అంతేకాకుండా తనతోపాటు స్వగ్రామం నక్కలదిన్నె తాండాకు పిల్లలతోసహా వెళ్లి జీవనం సాగిస్తామని భార్య, అత్తమామలకు ఎన్నోసార్లు చెప్పి చూశాడు. ఆమె ఇందుకు వ్యతిరేకించింది. భర్త ఒత్తిడి తట్టుకోలేక రేఖారాణి తన తల్లిదండ్రులు సునీత, మురళినాయక్, బంధువులు హరి నాయక్, గోపాల్‌నాయక్, ఆంజనేయులు నాయక్, మల్లికార్జున నాయక్‌ అలియాస్‌ బుడగ నాయక్‌లతో కలిసి రవీంద్రనాయక్‌ను కట్టెలతో కొట్టి చంపారు. తర్వాత చనిపోయాడని తెలిసి ఆత్మహత్యగా చిత్రీకరించి చుట్టుపక్కల వారిని నమ్మించారు. అలాగే ఆటోలో రవీంద్రనాయక్‌ను రిమ్స్‌కు తీసుకెళ్లగా అక్కడి వైద్యులు మృతి చెందాడని తెలిపారు.

పోలీసులకు ఫిర్యాదు చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. కడప డీఎస్పీ షేక్‌ మాసుంబాషా, రూరల్‌ సీఐ నాయకుల నారాయణ, సిబ్బందితో కలిసి మృతదేహాన్ని పరిశీలించారు. తర్వాత మృతుని బంధువులు రవీంద్రనాయక్‌ను చంపేశారని ఆరోపించారు. మృతుని తల్లి సాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన రూరల్‌ సీఐ నాయకుల నారాయణ, ఇన్‌ఛార్జి, వల్లూరు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి, ఏఎస్‌ఐలు దస్తగిరి, కొండారెడ్డి, కానిస్టేబుళ్లు పుల్లయ్య, సర్వేశ్వర్‌రెడ్డిలను డీఎస్పీ అభినందించారు.

మరిన్ని వార్తలు