బీమా సొమ్ము కోసం భర్తను చంపేసింది

4 Sep, 2018 01:51 IST|Sakshi

డ్రైవర్‌తో కలసి హత్యకు మొదటి భార్య కుట్ర

రూ. 60 లక్షల బీమా సొమ్ములో రూ. 10 లక్షలిస్తానంటూ బేరం

గొంతు నులిమి చంపిన డ్రైవర్‌

వాహన ప్రమాదంగా చిత్రీకరణ

దర్యాప్తులో హత్యగా నిర్ధారణ

నగరంలో ఘటన.. నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌ : రాజధానిలో ఓ తపాలాశాఖ ఉద్యోగి మరణం వెనుక దాగిన కుట్ర బయటపడింది. బీమా సొమ్ము కోసం మొదటి భార్యే భర్తను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. భర్త వద్ద డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తికి డబ్బు ఆశ చూపి భర్తను చంపించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులోని ఇద్దరు నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వనస్థలిపురం ఏసీపీ సి. గాంధీ నారాయణ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కమ్మగూడలోని భవానీనగర్‌ కాలనీకి చెందిన కేశ్యా నాయక్‌తో నల్లగొండ జిల్లా త్రిపురారం మండలంలోని బొర్రయపాలెంకు చెందిన కేతవత్‌ పద్మకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. ఆ తర్వాత ఏర్పడిన మనస్పర్థలతో భర్త తనను వేధిస్తున్నాడంటూ ఎనిమిదేళ్ల క్రితం తిరుమలగిరి పోలీసు స్టేషన్‌లో పద్మ ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణలో ఉంది. 

బీమా సొమ్ము ఇస్తానని ఆశజూపి... 
కేశ్యానాయక్‌ శైలజ అనే యువతిని రెండో వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలతో హాయిగా జీవిస్తున్నాడని, తాను మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తోందని భావించిన పద్మ... భర్తను హత్య చేస్తే రూ. 60 లక్షల బీమా సొమ్ముతోపాటు ఆయన ఉద్యోగం తనకు వస్తుందని భావించింది. ఇందులో భాగంగా కోర్టు వాయిదాల కోసం కేస్యనాయక్‌తో కలసి వచ్చే డ్రైవర్‌ సభావత్‌ వినోద్‌తో పద్మ పరిచయం పెంచుకుంది. భర్త తనను పట్టించుకోవడం లేదని, అందువల్ల ఆయన్ను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తే వచ్చే రూ. 60 లక్షల బీమా డబ్బులో రూ. 10 లక్షలు ఇస్తానని ఆశచూపింది. అతనికి నమ్మకం కలిగించేందుకు తొలుత రూ. 15 వేలు చెల్లించింది. వీరి పథకం ప్రకారం ఈ నెల 1న ఉద్యోగానికి వెళ్లి తిరిగి వస్తున్న కేస్య నాయక్‌కు వినోద్‌ ఫోన్‌ చేసి ఎల్బీ నగర్‌లో కలిశాడు. టీఎస్‌07యూఈ 2221 నంబర్‌ గల కారులో గుర్రంగుడ దగ్గర ఉన్న ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు తీసుకెళ్లి కేస్యా నాయక్‌కు మోతాదుకు మించి మందు తాగించాడు.

శనివారం అర్ధరాత్రి 2.30 గంటలకు గుర్రంగూడ నుంచి ఇంజాపూర్‌ వెళ్లే మార్గంలో కారు ఆపి వెనుక సీట్లోకి వెళ్లిన వినోద్‌... ముందుసీట్లో కూర్చున్న కేస్యా నాయక్‌ (43) గొంతు నులిమి చంపాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఇంజాపూర్‌ కమాన్‌ దగ్గరగల హైటెన్షన్‌ కరెంట్‌ స్తంభానికి కారు ఎడమవైపును మాత్రమే ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడంటూ పద్మ ఆదివారం ఉదయం వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు అది హత్యేనని నిరూపించే ఆధారాలు లభించాయి. మృతుని మెడ కమిలిపోయి ఉండటం, పోస్టుమార్టం నివేదికలోనూ గొంతు నులమడంతోనే కేస్యా నాయక్‌ మరణించినట్లు వెల్లడైంది. ఈ ఆధారాలనుబట్టి పోలీసులు సోమవారం ఉదయం ఇంజాపూర్‌ కమాన్‌ దగ్గర పద్మ, వినోద్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. 

మరిన్ని వార్తలు