ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

10 Jul, 2019 07:50 IST|Sakshi
నిందితులతో పోలీసు అధికారులు  

పోలీసుల అనుమానం నిజమైంది

నిందితుల అరెస్టు

సాక్షి, ప్రొద్దుటూరు క్రైం : పోలీసులు, కుటుంబ సభ్యుల అనుమానమే నిజమైంది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను భార్య హత్య చేసింది. ఈ కేసుకు సంబంధించిన నిందితులను మంగళవారం రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు... ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయునిపేటకు చెందిన కడియాల చంద్రశేఖర్‌ ఆచారి మూడేళ్ల నుంచి ప్రొద్దుటూరులోని అమృతానగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య మహాలక్ష్మి,  ఇద్దరు పిల్లలు ఉన్నారు.   ప్రొద్దుటూరులో కార్పెంటర్‌ పనికి వెళుతూ భార్యా, పిల్లలను పోషించేవాడు. ఈ క్రమంలో గత ఏడాది అక్టోబర్‌ 28న చంద్రశేఖర్‌ ఆచారి చనిపోయాడు. ఈ విషయాన్ని మహాలక్ష్మి తన అత్తా మామలకు తెలిపి మృతదేహాన్ని స్వగ్రామమైన సంజీవరాయునిపేటకు తరలించింది.

చంద్రశేఖర్‌ ఆచారి తల్లిదండ్రులు, మహాలక్ష్మి బంధువులు కలిసి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామ శివారులో శవాన్ని ఖననం చేశారు. రెండు నెలల పాటు గ్రామంలో ఉన్న మహాలక్ష్మి తర్వాత కనిపించలేదు. చంద్రశేఖర్‌ ఆచారి తల్లిదండ్రులు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ అని వస్తోంది. దీంతో మహాలక్ష్మి మామ వెంకటసుబ్బయ్య కోడలిని వెతుక్కుంటూ ప్రొద్దుటూరుకు వచ్చాడు. అమృతానగర్‌లో ఆమె కోసం ఆరా తీయగా ఆచూకీ లభించలేదు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అతను మైదుకూరు మండలం జీవీ సత్రంకు వెళ్లాడు. అక్కడ మహాలక్ష్మి రామకృష్ణ ఆచారి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు వెంకటసుబ్బయ్య గమనించాడు.

వారిద్దరిని చూసిన వెంటనే కుమారుడి మరణంపై అతనికి అనుమానం కలిగింది. దీంతో అతను స్వగ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి జరిగిన విషయాన్ని తెలిపాడు. కొన్ని రోజుల తర్వాత రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి అతను ఫిర్యాదు చేశాడు. తన కుమారుడి మరణంపై అనుమానం ఉందని, కోడలే హతమార్చి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారి ఫిర్యాదు మేరకు ఈనెల 3న రూరల్‌ ఎస్‌ఐ సునీల్‌రెడ్డి సంజీవరాయునిపేటకు వెళ్లి చంద్రశేఖర్‌ ఆచారి శవానికి పంచనామా నిర్వహించారు. 

ముగ్గురు కలిసి...
ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన రూరల్‌ సీఐ విశ్వనాథరెడ్డి లోతుగా దర్యాప్తు చేశారు. వారు ఉపయోగించిన ఫోన్‌ నంబర్లు ఆధారంగా ఈ హత్య కేసులో మరొకరి పాత్ర ఉన్నట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో మంగళవారం రామకృష్ణ ఆచారి, మహాలక్ష్మిలను రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. చంద్రశేఖర్‌ ఆచారిని అడ్డు తొలగించాలనే ఉద్దేశంతోనే గత ఏడాది అక్టోబర్‌ 28న అర్ధరాత్రి హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అతను నిద్రిస్తున్న సమయంలో రామకృష్ణ ఆచారి, మహాలక్ష్మిలు మురళీ అనే వ్యక్తితో కలిసి దిండు మొహంపై పెట్టి చంపేసినట్లు అంగీకరించారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు.  

మరిన్ని వార్తలు