భర్త ఇంటి ఎదుట భార్య మౌనపోరాటం

4 Jun, 2018 10:30 IST|Sakshi

ఇంటికి తాళం వేసి పరారైన జయకిషన్‌

ఇద్దరు కూతుళ్లతో కలిసి దీక్ష

పోలీసులకు ఫిర్యాదు

చిన్నగోల్కొండలో ఘటన

శంషాబాద్‌ రూరల్‌(రాజేంద్రనగర్‌) : తన ఇద్దరు కూతుళ్లతో ఓ వివాహిత భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఇంట్లోకి రాకుండా తాళం వేసి ఎటో వెళ్లిపోయాడంటూ బాధితురాలు రెండు రోజులుగా ఇంటి ఎదుట మౌనపోరాటం కొనసాగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌ జిల్లా దాసారం గ్రామానికి చెందిన జయకిషన్‌(63) విశ్రాంత ప్రొఫెసర్‌. రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లా బొబ్బరలంక వాసి లక్ష్మీచైతన్య(37)తో రెండో వివాహం చేసుకున్నాడు.

లక్ష్మీచైతన్య మొదటి భర్త మృతి చెందగా.. ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శంషాబాద్‌ మండలంలోని అమ్మపల్లి దేవాలయంలో వీరిద్దరు పెళ్లి చేసుకుని చిన్నగోల్కొండలో కాపురముంటున్నారు. ఈ క్రమంలో ఆరు నెలల నుంచి జయకిషన్‌ చిన్న చిన్న కారణాలతో లక్ష్మీని వేధించడం మొదలుపెట్టాడు. ఇద్దరు కూతుళ్లు తనకు పుట్టలేదని, వారి పోషణ బాధ్యత నాది కాదంటూ గొడవలకు దిగేవాడు. ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల కిందట తన ఇద్దరు కూతుళ్లతో కలిసి బొబ్బరలంక వెళ్లిన లక్ష్మీ శనివారం తిరిగి వచ్చి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది.

అనుమానంతో ఇంటి పరసరాలను పరిశీలిస్తుండగా.. దొడ్డి దారి నుంచి తన భర్త ఇంటి బయటకు వచ్చి పట్టించుకోకుండా వెళ్లిపోయాడని చెప్పింది. దీంతో అప్పటి నుంచి ఆమె ఇంటి బయట ఇద్దరు కూతుళ్లతో కలిసి బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని, ఇద్దరు కూతుళ్లు భవిష్యతు భరోసా కల్పించాలని డిమాండ్‌ చేస్తుంది.

తనకు రూ.10 లక్షలు ఇచ్చి వదిలించుకోవడానికి చూస్తున్నాడని, లాయర్ల ద్వారా ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ఈ మేరకు సాయంత్రం ఆమె శంషాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్యాభర్తకు కౌన్సిలింగ్‌ కోసం ఫ్యామిలీ కోర్టుకు సిఫార్సు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీధర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు