అదనపు కట్నం కోసం వేధింపులు

7 Mar, 2019 12:13 IST|Sakshi
అత్తారింటి వద్ద ధర్నా చేస్తున్న యామిని, శ్రీనివాసులు, యామినిల పెళ్లినాటి ఫొటో

భర్త ఇంటి ఎదుట   భార్య ఆందోళన

అనంతపురం సిటీ: అదనపు కట్నం మెట్టినింటి వారి వేధింపులు తాళలేని ఓ మహిళ న్యాయం కోసం ఆందోళనకు దిగింది. భర్త ఇంటి ఎదుట చంటిబిడ్దతో బైఠాయించింది. ఈ ఘటన బుధవారం నగరంలోని శ్రీనగర్‌కాలనీలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు... నగరంలో శ్రీనగర్‌కాలనీకి చెందిన శ్రీనివాసులుకు గుంతకల్లుకు చెందిన యామినితో 2016లో వివాహమైంది. అప్పట్లో కట్నం కింద రూ.15 లక్షల నగదు, 23 తులాల బంగారు నగలు, రెండు సెంట్ల స్థలం ఇచ్చారు. పెళ్లి అయినప్పటి నుంచి అదనపుకట్నం కోసం భర్త, అత్తమామాల నుంచి వేధింపులు ప్రారంభమాయ్యియి. భర్త తనను మానసికంగా, శారీరకంగా హింసించడంతో పాటు జేఎన్‌టీయూ అనుబంధ ఓటీఆర్‌ఐలో ఉద్యోగానికి రాజీనామా చేయించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ విషయంపై గతంలో గుంతకల్లు వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపింది. అయితే పోలీసుస్టేషన్‌కు రావాలని చెప్పినా బేఖాతరు చేస్తున్నట్లు ఆరోపించింది. దీంతో తాను న్యాయం కోసం ధర్నాకు దిగినట్లు వివరించింది. దాదాపు రెండు గంటల పాటు చంటిబిడ్డతో భర్త ఇంటి ఎదుట ఆందోళన కొనసాగించింది. విషయం తెలుసుకున్న నాల్గవ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలికి సర్దిచెప్పారు. న్యాయం చేస్తామని, స్టేషన్‌కువచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈమెకు మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆశాబీ, పద్మావతి, చేతివృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగమయ్య తదితరులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్తమామలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు