రూ.2 కోట్ల బీమా కోసం భర్తను హత్య చేయించిన భార్య 

15 Mar, 2018 12:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కర్నూలు : బీమా మొత్తం కోసం భర్తనే హత్య చేయించిన భార్య ఉదంతమిది. హత్యకు సంబంధించిన వివరాలను బుధవారం కర్నూలులో డీఎస్పీ ఖాదర్‌బాషా, తాలూకా సీఐ నాగరాజుయాదవ్‌ తెలిపారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చోలవీడు గ్రామానికి చెందిన శ్రీనివాసులు, భార్య రమాదేవి, ఆయన బావమరిది రమేష్‌ కలిసి హైదరాబాద్‌లో ఉంటూ ఆయిల్‌ వ్యాపారం చేస్తున్నారు. రమాదేవికి చోలవీడు సర్పంచు మధుసూదన్‌రెడ్డి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. రమాదేవి, మధుసూధన్‌రెడ్డి, రమేష్, ఆయన భార్య శివప్రణీత కలిసి శ్రీనివాసులును హత్య చేసేందుకు ప్రణాళిక రచించారు. భర్తతో కాపురం చేయటం ఇష్టంలేని రమాదేవి, డబ్బుపై దురాశగల రమేష్‌, శివప్రణీత దంపతులు కలిసి శ్రీనివాసులు చేత తెలివిగా బీమా చేయించి, వాటిపై రుణాలు పొందారు. ఈ మేరకు ఆయనపై వేర్వేరు చోట్ల బీమా చేయించారు. అతన్ని చంపేసి ప్రమాదంగా చిత్రీకరిస్తే రూ.2కోట్ల దాకా బీమా మొత్తం వస్తుందని వారు అంచనా వేశారు. 

ఈ మేరకు శ్రీనివాసులుకు మాయమాటలు చెప్పి రమేష్‌ తన వద్ద పనిచేసే రమణ, మొయిన్‌బాషలతో తీర్థయాత్రలకు తీసుకెళ్లాడు. జనవరి 25వ తేదీన వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓర్వకల్లు సమీపంలో ఆపి రోడ్డుపై మాట్లాడుతున్నట్లు నటించారు. అదే సమయంలో అటుగా వస్తున్న లారీని గమనించి దాని కిందకు శ్రీనివాసులును తోసేశారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులును మొయిన్‌బాషా గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత శ్రీనివాసులును గుర్తు తెలియని వాహనం ఢీకొందని ఓర్వకల్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే శ్రీనివాసులు మృతిపై అతని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. 

దీంతో రమణ, మొయిన్‌బాషాను పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకోగా, శ్రీనివాసులు భార్య రమాదేవి, బావ మరిది రమేష్, మధుసూదన్‌రెడ్డి, శివప్రణీత పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు