నాకు న్యాయం కావాలి

23 Jan, 2018 08:52 IST|Sakshi
భర్త ఇంటి ముందు నిరాహారదీక్ష చేస్తున్న విజయలక్ష్మీ

ఆ తర్వాత ముఖం చాటేసిన వైనం..

భర్త  ఇంటి ముందు భార్య నిరాహారదీక్ష

పలువురి సంఘీభావం

రాజంపేట : ప్రేమించాడు. ఆ తర్వాత రహస్య వివాహం చేసుకున్నాడు. ఆమె గర్భం దాల్చడంతో అబార్షన్‌ చేయించాడు. ఆపై ముఖం చాటేశాడు. ఈ నేపథ్యంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె రాజంపేటలోని భర్త ఇంటి ఎదుట సోమవారం నిరాహారదీక్ష చేపట్టింది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజంపేట పట్టణంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న రంగాయపల్లె రెడ్డయ్య అనే యువకుడు శివపురం రంగయ్య కుమార్తె విజయలక్ష్మీ మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. విజయలక్ష్మీ గర్భం దాల్చింది. ఇప్పుడే పిల్లలు వద్దని, పెద్దలను ఒప్పించిన తర్వాత ఆలోచిద్దామని మాయమాటలు చెప్పి అబార్షన్‌ చేయించాడు. విజయలక్ష్మిని ఆమె తల్లిదండ్రుల వద్ద వదిలి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత ఆమెను పట్టించుకోవడం మానేశాడు. దీంతో తాను మోసపోయానని అనుమానించిన ఆమె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గతంలో పట్టణ సీఐ ఇరు కుటుంబాల వారిని పిలిపించి మాట్లాడారు. తాను అందరి సమ్మతితో పెళ్లి చేసుకుంటానని, లేని పక్షంలో తనపై పోలీసులు ఎలాంటి చర్య అయినా తీసుకోవచ్చని రెడ్డయ్య ఉరఫ్‌ రెడ్డి రాకేష్‌ రాతపూర్వకంగా పోలీసుల సమక్షంలో రాసి ఇచ్చాడు. అయితే ఇప్పుడు తాను విజయలక్ష్మిని వివాహం చేసుకోనని, ఆమెది తమ కులంకాదని మొండికేశాడు. దీంతో ఆమె భర్త ఇంటి ఎదుట నిరాహారదీక్షకు దిగింది. ఈమెకు పలువురు సంఘీభావం తెలుపుతున్నారు. కాగా అధికారపార్టీకి చెందిన ఇద్దరు నాయకులు భార్యను మోసం చేసిన భర్తకు అండగా నిలిచి మధ్యవర్తిత్వం చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.

మరిన్ని వార్తలు