తల్లి, ఏడుగురు కొడుకుల క్రైమ్స్‌ కహానీ

2 Nov, 2017 11:21 IST|Sakshi

వందకు పైగా క్రిమినల్ కేసులు

ఎట్టకేలకు అరెస్ట్ చేసిన పోలీసులు

భర్త, కూతుళ్లకు మాత్రం మంచోళ్లు

సాక్షి, న్యూఢిల్లీ : తల్లిదండ్రుల పెంపకం మీదే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. కానీ, ఇక్కడో తల్లి మాత్రం తన పిల్లలకు నేర్పింది ఒక్కటే. నేరాలు చేయటం ఎలా? అని... క్రైమ్‌ సినిమాను తలపించిన ఈ ఘటన దేశ రాజధానిలో చోటు చేసుకుంది.

కొన్నేళ్ల క్రితం రాజస్థాన్‌ దొల్‌పూర్‌కు చెందిన మల్కన్‌ సింగ్, అతని భార్య బసిరన్‌ పొట్టకూటి కోసం ఢిల్లీలోని సంగమ్‌ విహార్‌కు వచ్చారు. అక్కడి ఓ మురికివాడలో నివాసం ఏర్పరుచుకుని కూలీ పనులకు వెళ్లటం ప్రారంభించారు. అయితే ఏడుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లను పోషించటం కష్టంగా మారింది. దీంతో బసిరన్‌ నేర ప్రవృత్తి వైపు మళ్లింది. 2000 సంవత్సరంలో గుడుంబా కాయటం ద్వారా సంపాదించటం మొదలుపెట్టింది. అలా తన నేర ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె.. తన కొడుకులను కూడా మెల్లిగా ఊబిలోకి దింపింది. స్కూల్‌కెళ్లటం మానేసిన పిల్లలు అక్కడి లోకల్‌ గుండాలతో తిరగటం ప్రారంభించారు.  తల్లి ప్రోత్సాహంతో క్రమక్రమంగా దందాలు, దొంగతనాలు, హత్యలు చేయటం నేర్చుకున్నారు. 

ఇప్పటిదాకా ఆ తల్లి-కొడుకులపై 100 దాకా కేసులు నమోదు అయినట్లు పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా 2004-2007 మధ్య కాలంలో వారి నేర కాండ మరీ దారుణంగా సాగిందని పేర్కొన్నారు. దొపిడీలు, అక్రమంగా ఆయుధాలను కలిగి ఉండటం, హత్య కేసులు ఇలా వారిపై ఉన్నాయి. బసిరన్‌ పై కూడా మూడు క్రిమినల్ కేసులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆమె కొడుకులు అంతా 15 నుంచి 18 ఏళ్లలోపు వారే. వారందరిపై 10 కేసులకు తక్కువగా లేవంట. చిన్న కొడుకు అరెస్ట్ చేసి ఆపై వల వేసి ఒక్కోక్కరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

అయితే వీళ్ల వ్యవహారం ఇలా ఉంటే.. ఆయన భర్త, కూతుళ్లది మాత్రం చాలా సత్ప్రవర్తన అని పోలీసులు చెప్పారు. భర్త మల్కన్ గొర్రెలు కాచుకుంటూ జీవిస్తుంటే.. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు అయిపోగా, మరో ఇద్దరు చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. వీరికి వాళ్ల నేరాలతో ఎలాంటి సంబంధం లేదని.. గతంలో చాలాసార్లు వీళ్లు అడ్డుచెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.  ప్రస్తుతం బసిరన్‌ మరియు ఆమె ఆరుగురు కొడుకులు తీహార్ జైల్లో రెస్ట్ తీసుకుంటుండగా, చిన్న కొడుకును మాత్రం జువైనల్‌ హోంకి తరలించారు.

మరిన్ని వార్తలు