లేడీ కేడీ అరెస్టు

20 Nov, 2018 10:48 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ పృథ్వీందర్‌రావు, సీఐలు రంగస్వామి, వెంకటేశం నిందితురాలు మెహరున్నీసా

రాష్ట్రంలో 42 ఏపీలో

8 కేసుల్లో నిందితురాలు

చైతన్యపురి: దేవాలయాలు, పాఠశాలల వద్ద మాటువేసి చిన్నపిల్లల ఆభరణాలు దోచుకుంటున్న ఓ కరడుగట్టిన పాత నేరస్తురాలిని సరూర్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేసి నగదు, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సరూర్‌నగర్‌ సీఐ రంగస్వామి, డీఐ వెంకటేశం సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు.  కొత్తపేట శృంగేరికాలనీలో నివసించే మెహరున్నీసా అలియాస్‌ మమత (37) టైలర్‌గా పనిచేసేది. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో నేరాల బాటపట్టింది. తల్లి రషీదాబేగం (70), సోదరుడు సయ్యద్‌ మహ్మద్‌ (25)తో కలిసి చోరీలకు పాల్పడేవారు. దేవాలయాలు, పాఠశాలలు, రద్దీ ప్రాంతాల్లో తిరుగుతూ 5 నుంచి 10 సంవత్సరాల బాలికలను ఎంచుకుని వారికి మాయమాటలు చెప్పి నిర్మానుష్యమైన ప్రాంతాలకు తీసుకెళ్లి వారి వంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలు దోచుకుని వదిలేసేవారు.

ఈనెల 14న సరూర్‌నగర్‌ ప్రాథమిక పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న 6 సంవత్సరాల బాలికకు మాయమాటలు చెప్పి బంగారు చెవిపోగులు, కాళ్ల పట్టీలు తీసుకుని పారిపోయారు. కేసు నమోదు  చేసిన ఎస్‌ఐ కృష్ణయ్య విచారణ చేపట్టి నిందితురాలు మెహరున్నీసాగా గుర్తించారు. ఆదివారం పీఅండ్‌టీ కాలనీలో ఆమె అనుమానాస్పందంగా తిరుగుతుండటంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆమె వద్ద నుంచి రూ. లక్ష నగదు, 25గ్రాముల బంగారం, 160 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. సరూర్‌నగర్‌ స్టేషన్‌ పరిధిలోని ఆరుకేసుల్లో ఆమె నిందితురాలని పేర్కొన్నారు. గతంలో ఆమెపై ఎల్‌బీనగర్‌ స్టేషన్‌ పరిధిలో 22, మియాపూర్‌లో ఒకటి, రాయదుర్గంలో అయిదు, మైలార్‌దేవులపల్లిలో ఒకటి, రాజేంద్రనగర్‌లో రెండు, చందానగర్‌లో ఒకటి, సంతోష్‌నగర్‌లో రెండు, కాంచన్‌బాగ్‌లో ఒకటి, మాదన్నపేటలో ఒక కేసు నమోదై ఉన్నాయన్నారు. అలాగే ఆంధ్రాలో 8 కేసులు ఉన్నాయని పలు కేసుల్లో జైలుకు కూడా వెళ్లివచ్చిందని వివరించారు. మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు