కిడ్నీ రాకెట్‌ సూత్రధారి అరెస్ట్‌

25 Jul, 2018 13:14 IST|Sakshi
కనకమహాలక్ష్మి

విశాఖపట్నం పీఎం పాలెం(భీమిలి): నిరుపేదలను, డబ్బు అవసరం ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని కిడ్నీల రాకెట్‌ నడపడంలో ప్రధాన సూత్రధారి కనకమహాలక్ష్మిని పీఎం పాలెం పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి స్థానిక సీఐ కె.లక్ష్మణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం... గాజువాక బీసీ కాలనీకి చెందిన కనక మహాలక్ష్మి (40) ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నవారితో పరిచయాలు పెంచుకునేది.

కిడ్నీ దానం చేసే వారికి లక్షలాది రూపాయలు చెల్లించే వారు తనకు తెలుసునని నమ్మించేది. పాతిక నుంచి 40 లక్షల రూపాయల వరకూ లబ్ధి పొందవచ్చునని ఎర వేసేది. ఆవిధంగా గోపాలపట్నం, ఆరిలోవ, కేఆర్‌ఎం కాలనీ ప్రాంతాలకు చెందిన కొంతమంది ఆమె మాటల వలకు చిక్కారు. కిడ్నీ ఇచ్చే వారు ముందుగా సుమారు రూ. 40 వేలు విలువ చేసే ఇంజక్షన్లు నాలుగు దపాలుగా వేయించుకోవాల్సి ఉంటుందని నమ్మించింది. అలా డాక్టర్‌తో ఇంజక్షన్లు వేయించి డబ్బు కాజేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టి కనకమహాలక్ష్మిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు