బాలికకు చెంపదెబ్బ.. మహిళానేతపై కేసు

24 Sep, 2017 17:54 IST|Sakshi

అలీఘడ్‌: ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో ఓ టీ కొట్టు వద్ద ముస్లిం యువకుడితో కలసి కూర్చున్న బాలికను కొట్టిన కేసులో స్థానిక బీజేపీ మహిళా విభాగం నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి బాలిక తండ్రి సవేంద్ర కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీజేపీ మహిళా నేత సంగీత వర్షిణిపై గాంధీపార్క్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. తన కుమార్తెపై అందరూ చూస్తుండగా చేయి చేసుకోవడంతో తమ ప్రతిష్ట దెబ్బతిందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. లవ్‌ జిహాద్‌ పేరుతో మోరల్‌ పోలీసింగ్‌ చేయడం, బెదిరింపులకు దిగే వారిపై చర్య తీసుకోవాలన్నారు. సంగీతపై ఐపీసీ సెక్షన్‌ 323, 504 కింద కేసు నమోదు చేసినట్టు గాంధీపార్క్‌ పోలీసుస్టేషన్‌ సీఐ పంకజ్‌ శ్రీవాస్తవ తెలిపారు. 

ఓ టీ కొట్టు వద్ద ముస్లిం యువకుడితో కలసి కూర్చొని ఉందనే నెపంతో బాలికపై సంగీత వర్షిణి బహిరంగంగా చేయిచేసుకుంది. ‘హిందువు ఎవరో, ముస్లిం ఎవరో తెలుసుకోకుండానే ప్రేమిస్తావా. నేను మర్యాదగా చెప్పినా వినవా’ అంటూ బాలికను ఆమె హెచ్చరించింది. చేయి కూడా చేసుకుంది. ఈ ఘటనను ఓ వ్యక్తి కెమెరాతో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అది సంచలనంగా మారింది. సంగీత వర్షిణి చర్యపై మహిళా హక్కుల పరిరక్షణ సంఘం కార్యకర్త కల్పనా గుప్తా మండిపడ్డారు.  

మరిన్ని వార్తలు