వీడియో చూపి మహిళను బెదిరించి..

29 Jun, 2019 12:31 IST|Sakshi

సాక్షి, ఆత్మకూరు(నెల్లూరు) : ఓ యువకుడు మహిళను బ్లాక్‌మెయిల్‌ చేసి సుమారు రూ.60 లక్షలకు పైగా నగదు తీసుకున్నాడు. ఈక్రమంలో అతడిపై ఆమె సంబంధీకులు దాడి చేశారు. దీంతో యువకుడు వారిపై కేసు పెట్టిన ఘటన ఆత్మకూరులో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు.. మున్సిపల్‌ పరిధిలో ఓ మహిళ ఫలసరుకుల దుకాణం నిర్వహిస్తోంది. ఆ పక్కనే ఓ యువకుడు సెల్‌ఫోన్‌ దుకాణం నిర్వహిస్తుంటాడు. అతను కరెంట్‌ పనులు కూడా చేస్తుంటాడు. ఈక్రమంలో ఆ మహిళ తమ ఇంట్లో కొత్త సీలింగ్‌ ఫ్యాన్‌ బిగించాలని అతడిని కోరింది. అతను ఆమె ఇంట్లో ఫ్యాన్‌ బిగించి బాత్‌రూమ్‌లో రహస్యంగా వీడియో కెమెరా ఏర్పాటు చేశారు. వారంరోజుల అనంతరం అందులో రికార్డైన దృశ్యాలను ఆమెకు చూపించి బెదిరించాడు. నగదు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్‌ చేశాడు. భయపడిన ఆమె అతను అడిగిన మేరకు నగదు ఇచ్చింది. యువకుడు సదరు మహిళ వద్ద సుమారు రూ.60 లక్షలకు పైగా వసూలు చేశాడని చెబుతున్నారు. 

ఇలా బయటపడింది
వ్యాపార నిర్వహణ పేరుతో పలువురు వద్ద మహిళ అప్పులు చేసిందని, సుమారు రూ.కోటికి పైగా అప్పులైందని, వారంరోజుల క్రితం గ్రామంలో పుకార్లు రావడంతో ఒక్కసారిగా ఆమెకు అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆమె ఆ యువకుడికి తాను నగదు ఇచ్చానని, అతను చేసిన పనిని భర్త, బంధువులకు చెప్పింది. ఈ క్రమంలో ఆమె బంధువులు ఆ యువకుడిని గట్టిగా ప్రశ్నించడంతో నిర్లక్ష్యంగా చెప్పాడు. దీంతో అతడిని తీసుకెళ్లి దాడి చేశారు. ఈ విషయం ఆత్మకూరు పోలీసులకు తెలియడంతో ఎస్సైలు సి.సంతోష్‌కుమార్‌రెడ్డి, రూరల్‌ ఎస్సై రోజాలతలు విడివిడిగా ఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. కేసులు అవసరం లేదని, మేము రాజీ చేసుకుంటామని ఆ వర్గాలు చెప్పడంతో వెనుదిరిగారు. 

నెల్లూరులో ఫిర్యాదు
మంగళవారం రాత్రి సదరు యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో మహిళ తరఫు వారు అతడిని ఓ ప్రైవేట్‌ కాంపౌండర్‌ వద్దకు తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించి వదిలేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆత్మకూరు ఎస్సై సంతోష్‌కుమార్‌రెడ్డి అదే రాత్రి తన సిబ్బందితో కలిసి మీడియా వారిని వెంట తీసుకుని యువకుడి కోసం వెతికారు. అయితే వారి ప్రయత్నం వృథా అయింది. ప్రథమచికిత్స అనంతరం ఆ యువకుడు ఏఎస్‌పేట మండలం చౌటభీమవరంలో తన బంధువుల ఇంట్లో ఒకరోజు తలదాచుకుని గురువారం నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు శుక్రవారం తెల్లవారుజామున ఆత్మకూరు పోలీసులకు సమాచారమిచ్చి మహిళతో సహా 18 మందిని నెల్లూరుకు తీసుకెళ్లారు. వారిలో ఇద్దరిపై ఎలాంటి ఆరోపణలు లేకపోవడంతో వదిలేశారు. 16 మందిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. యువకుడికి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. కాగా దీని విషయమై ఆత్మకూరు పోలీసులు మాట్లాడుతూ నెల్లూరు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్న విషయం వాస్తవమేనని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిని అదుపులోకి తీసుకున్న సమయంలో తాము వెళ్లామన్నారు.     

మరిన్ని వార్తలు