-

ఆ మహిళ బ్లాక్‌ మెయిల్‌ చేస్తోంది

7 Aug, 2018 01:51 IST|Sakshi

పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర  

హైదరాబాద్‌: తనపై అసత్య ఆరోపణలు చేసిన మదర్‌ థెరిసా ఫౌండేషన్‌ ప్రతినిధి కొమురెల్లి విజయలక్ష్మీరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ చీఫ్‌ విప్, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాను సదరు మహిళను లైంగికంగా వేధించానంటూ దుష్ప్రచారం చేసిందని, తన అపార్ట్‌మెంట్‌ వద్దకు వచ్చి న్యూసెన్స్‌ క్రియేట్‌ చేసిందని  ఫిర్యాదులో పేర్కొన్నారు. గత 8 నెలలుగా తప్పుడు ప్రచారం చేస్తూ తనను సమాజంలో కించపరిచేలా ప్రవర్తిస్తోందని, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోందని తెలిపారు. తన కుటుంబ సభ్యులపై అసత్య ప్రచారం చేస్తోందన్నారు. 2016లో తన సోదరుడికి ఉద్యోగం ఇప్పించాల ంటూ విజయలక్ష్మి తొలిసారిగా తనను కలిసిందని అవకాశం ఉంటే కల్పిస్తానని హామీ ఇచ్చానన్నారు.

ఆ తర్వాత మదర్‌థెరిసా ఫౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థ పేరుతో తనను కలసి ఆర్థిక సాయం కోరిందన్నారు. తాను కొంత ఆర్థిక సహాయం సంస్థకు అందించానని, ఆ తర్వాత పలుమార్లు ఫోన్‌ చేసి తనను ఆఫీస్‌లో కలసిందని చెప్పారు. లైంగికంగా కలుద్దామంటూ పలుమార్లు తనపై ఒత్తిడి తేగా అందుకు తాను ఒప్పుకోలేదని అప్పటి నుంచి బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలు పెట్టిందన్నారు. ఓ పత్రికలో ఇటీవల మాయలేడి పేరుతో ఓ కథనం రాగా అది ఈ మహిళ గురించేనని తెలుసుకున్నట్లు చెప్పారు. కొందరు నేతలు ఆమెకు అండగా నిలుస్తూ తనపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. డబ్బుల కోసమే ఆమె ఇదంతా చేస్తోందన్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్‌ 384, 506 కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు