కన్నకూతురి ముందే కిరోసిన్‌ పోసి..

19 Aug, 2019 15:00 IST|Sakshi

సాక్షి, లక్నో: ట్రిపుల్‌ తలాక్‌ కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా, కఠిన శిక్షలు అమలు చేస్తున్నా పరిస్థితుల్లో మార్పు రావటం లేదు. ఇందుకు ఉత్తర ప్రదేశ్‌లోని శ్రావస్తిలో శుక్రవారం జరిగిన పాశవిక ఘటన సాక్ష్యంగా నిలిచింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లో ఓ గ్రామంలో సయిదా నివాసముంటోంది. ఉపాధి నిమిత్తం ఆమె భర్త ముంబైలో ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితం అతను సయిదాకు ఫోన్‌ చేసి మూడు సార్లు తలాక్‌ చెప్పాడు. తన భర్త విడాకులు కోరుతున్నాడంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసుకోలేదు. భర్తతో కలిసి ఉండమని చెప్పి పంపించారు. నిస్సహాయ స్థితిలో ఇంటికి వెళ్లిన సయిదాతో ఆమె భర్త వాగ్వాదానికి దిగాడు. వెళ్లిపొమ్మంటూ బెదిరించాడు.

పోలీసులను ఆశ్రయించినందుకు ఆగ్రహించిన భర్త ఆమె ఆమె ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. అయిదు సంవత్సరాల కన్నకూతురు ముందే ఈ దారుణానికి ఒడిగట్టడంతో బాలిక భయకంపితురాలైంది. ఆ సమయంలో అక్కడే ఉన్న వారి కుటుంబసభ్యులు అడ్డుకోకపోగా సహకరించడం గమనార్హం. బాలిక పోలీసులకు చెప్పిన విషయాల ప్రకారం.. ఆమెను చంపడానికి కుటుంబం అంతా కలిసి ప్లాన్‌ చేశారు. ఈ క్రమంలో ఆమె పారిపోకుండా భర్త జుట్టు పట్టుకోగా అతని సోదరీమణులు ఒంటిపై కిరోసిన్‌ పోశారు. వెంటనే అతని తల్లిదండ్రులు ఆమెకు నిప్పంటించారు. తీవ్ర నరకయాతన అనుభవించిన ఆమె కన్నుమూసింది. పోలీసులు నిందితుడితోపాటు అతని కుటుంబంపై వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అయితే గతంలో ఆగస్టు 6న బాధితురాలు పోలీసులను ఆశ్రయించినప్పటికీ కేసు నమోదు చేయకపోవటంపై విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు