దొంగను ఉతికేస్తుందనుకుంటే కాఫీ ఇచ్చింది

20 Feb, 2018 15:11 IST|Sakshi
మహిళా దగ్గర నుంచి పర్సు కొట్టేస్తున్న దొంగ (ప్రతీకాత్మక చిత్రం)

కెనడా : సాధారణంగా ఓ దొంగ వస్తువును ఎత్తుకెళితే పట్టరాని కోపం వస్తుంది. ఆ దొంగ దొరికితే ముందు వెనుకాముందు చూడకుండా ఉతికి ఆరేస్తారు. ఆ తర్వాత పోలీసులకు పట్టిస్తారు. కానీ, కెనడాకు చెందిన ఓ మహిళ మాత్రం మరో మహిళ దగ్గర నుంచి పర్సును దొంగిలించి పారిపోతున్న ఓ దొంగను పట్టుకొని అతడుగానీ, చుట్టుపక్కలవారుగానీ ఊహించని విధంగా సపర్యలు చేసింది. ఓ కప్పు కాఫీని తాగించి, అతడి బాగోగులు అడిగి దయానురాగాలు కురిపించింది. అలా ఎందుకు చేశారో మిస్‌ అబౌఘోష్‌ అనే ఆ మహిళ ఓ ఇంటర్వ్యూలో ఆమె వివరించారు.

'నేను మా ఆఫీసు వెనుకవైపు నడుస్తూ ఓ వీధిని దాటుతున్నాను. అంతలో మహిళ దొంగా.. దొంగా.. అని అరిచింది. నేను అతడిని వెంబడించాను. అతడు ఓ చెత్త కుప్ప వెనుకాల దాక్కున్నాడు. అతడి కంటినిండా నీళ్లున్నాయి. పర్సు తిరిగి ఇచ్చేస్తూ క్షమించండంటూ వేడుకున్నాడు. జాలేసింది. పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని చెప్పాను. అక్కడికి చేరుకున్న వారిని కూడా కొట్టొద్దని చెప్పాను. వెంటనే అతడిని తీసుకెళ్లి ఓ హోటల్‌లో కూర్చొబెట్టి కప్పు కాఫీ తాగించి అతడి కష్టాలను వాకబు చేశాను. అతడు వాస్తవానికి పారిపోయేవాడిలా కనిపించలేదు.. అతడిని చూస్తే చాలా కోల్పోయినవాడిలా కనిపించాడు. బాగా నీరసంగా కనిపించాడు. అందుకే అలా చేశాను' అని అంటూ వివరించారు.
 

మరిన్ని వార్తలు