లంకెబిందెల పేరుతో మోసం

13 Nov, 2018 12:58 IST|Sakshi
వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌లో వృద్ధ దంపతులు

రూ.30 వేలతో మహిళ పరారీ

లబోదిబోమంటున్న వృద్ధ దంపతులు   

నెల్లూరు, వెంకటాచలం: ‘మీ ఇంట్లోని బావి వద్ద రెండు లంకెబిందెలున్నాయి. తవ్వితే మీ దశ తిరుగుతుంది. రూ.లక్షలు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఇల్లు నిర్మించుకోవచ్చు. మిగిలిన సొమ్మును నమ్మకం కలిగిన వ్యక్తులకు వడ్డీకి ఇచ్చి కష్టం చేయకుండా జీవితాంతం బతికేయొచ్చు’ అంటూ ఓ మహిళ నమ్మ బలికింది. ఆమె మాటలు నమ్మి ఉన్న సొమ్మును పోగొట్టుకున్న వృద్ధ దంపతులు లబోదిబోమంటున్నారు. ఈ మేరకు సోమవారం వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చారు. వారి కథనం మేరకు.. మండలంలోని అనికేపల్లి గ్రామానికి చెందిన ముసునూరు వెంకయ్య, నారమ్మ వృద్ధ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.

గొలగమూడిలోని అద్దె నివాసంలో ఉంటున్న బేల్దారి కూలి గోపి రెండునెలల క్రితం అనికేపల్లికి వచ్చాడు. వెంకయ్య నివాసం పక్కనే అతను పని చేసేవాడు. గోపి భార్య స్వర్ణలత అక్కడకు వచ్చేది. ఈక్రమంలో ఆమె మీ నివాసంలో బావి పక్కన లంకెబిందెలున్నాయని వెంకయ్యను, అతని భార్య నారమ్మను నమ్మించింది. వాటిని బయటకు తీయిస్తే అందులో ఉండే నగలతో మీ జీవితం మారిపోతుందని చెప్పింది. స్వర్ణలత మాటలు నమ్మిన వృద్ధ దంపతులు లంకెబిందెలు తవ్విం చాలని ఆమెకు చెప్పారు. దీంతో స్వర్ణలత పలు దఫాలుగా వారి నుంచి రూ.30 వేలు తీసుకుంది. దీపావళి రోజున స్వామిని తీసుకువచ్చి తవ్విస్తానని, ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పొద్దని తెలిపింది. అయితే ఆమె రాలేదు. దీంతో ఆరాతీయగా పండగ మరుసటిరోజు నుంచి స్వర్ణలత, ఆమె భర్త గొలగమూడిలోని అద్దె నివాసంలో లేరని తెలియడంతో మోసపోయామని వెంకయ్య, నారమ్మ బోరున విలపిస్తున్నారు. కొత్త ఇల్లు కట్టుకోవచ్చని ఆశపడి కొంత అప్పు కూడా చేసి ఇచ్చామని వాపోతున్నారు. 

మరిన్ని వార్తలు