పోషణభారంతో  వివాహిత ఆత్మహత్య 

15 Oct, 2019 08:14 IST|Sakshi
 రేణుక కుమార్తెలను పరామర్శిస్తున్న సీడీపీఓ గీతాంజలి, బోయ రేణుక మృతదేహం  

సాక్షి, కళ్యాణదుర్గం రూరల్‌(అనంతపురం) : పిల్లల పోషణ భారమై వివాహిత అర్ధంతరంగా తనువు చాలించింది. ఈ ఘటన కళ్యాణదుర్గంలో జరిగింది. మృతురాలి భర్త, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కళ్యాణదుర్గం పట్టణం చౌడేశ్వరివీధిలో నివాసముంటున్న నాగరాజు, నాగమణి దంపతుల కుమార్తె బోయ రేణుక (26)కు కుందుర్పి మండలం గురువేపల్లికి చెందిన మూర్తితో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు హర్షిత(8), ధరణి(3), మరో 4 నెలల పాప ఉన్నారు. మూర్తి మూడు ఎకరాల పొలంలో టమాట సాగు చేశాడు. పంట చేతికందకపోవడంతో నష్టం వచ్చింది. అప్పటి నుంచి కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో కొన్ని నెలలు పుట్టింటిలో ఉండాల్సిందిగా భార్య, పిల్లలను కళ్యాణదుర్గం పంపించాడు.

అక్కడ కుమార్తెలను పోషించుకునే దారి తెలియక మదనపడేది. బతుకుదెరువు కనిపించకపోవడంతో పిల్లలను పస్తులుండటం చూడలేక మనస్తాపం చెందిన రేణుక సోమవారం ఉదయం ఇంట్లోనే దూలానికి చీరతో ఉరివేసుకుంది. కొద్దిసేపటి తర్వాత బంధువులు, స్థానికులు గమనించి ఆమెను కిందకు దించి హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే రేణుక ప్రాణం విడిచినట్టు డాక్టర్లు నిర్ధారించారు. భర్త మూర్తి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. 

చిన్నారులను శిశు గృహానికి పంపించడానికి చర్యలు 
తల్లిని కోల్పోయిన ముగ్గురు పిల్లల బాగుగోలు చూసుకునేందుకు అనంతపురంలోని శిశుగృహకు పంపించడానికి చర్యలు తీసుకుంటామని ఐసీడీఎస్‌ సీడీపీఓ గీతాంజలి, సూపర్‌వైజర్‌ పద్మజ తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వాస్పత్రికి చేరుకుని చిన్నారుల వివరాలను సేకరించారు. త్వరలోనే చిన్నారులను శిశుగృహకు అప్పగిస్తామని సీడీపీఓ చెప్పారు.   

మరిన్ని వార్తలు