మహిళ ఆత్మహత్య

6 Jan, 2018 09:25 IST|Sakshi
మంజుదేవి మృతదేహం

భార్య, భర్త మధ్య విభేదాలే కారణమా?

రిమ్స్‌ మార్చురీకి మృతదేహం

కడప అర్బన్‌ : కడప నగరంలోని టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హబీబుల్లా వీధిలో నివసిస్తున్న మంజుదేవి(32) అనే మహిళ గురువారం రాత్రి తాను నివసిస్తున్న ఇంటి పడక గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువుల, పోలీసుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో మధురైలో స్థిరపడ్డ మంజుదేవి తల్లిదండ్రులు అక్కడ స్టేషనరీ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. 12 సంవత్సరాల కిందట కడప నగరం హబీబుల్లావీధికి చెందిన మంగల్‌చంద్‌ అనే వ్యక్తికి మంజుదేవికి వివాహం జరిగింది. వీరికి సేజల్‌ (11), అంజలి (9), మనీష్‌ (7) అనే పిల్లలు ఉన్నారు. మంగల్‌చంద్‌ ఆర్కేఎం స్ట్రీట్‌లో కాజల్‌ రెడీమేడ్‌ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు.

తన తల్లిదండ్రులు, బంధువులతోపాటు ఒకే ఇంటిలో ఉంటున్నాడు. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడడంతో ఇరువురు కుమార్తెలతో తల్లి మంజుదేవి పడక గదిలో పడుకుంది. కుమారుడు మనీష్‌తోపాటు హాలులో అందరితో కలిసి మంగల్‌చంద్‌ పడుకున్నాడు. తెల్లవారి చూసేసరికి ఫ్యాన్‌కు మంజుదేవి చీరెతో ఉరేసుకుని వేలాడుతుండడంతో వెంటనే భర్త, బంధువులు రక్షించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆమె మృతి చెంది ఉంది. కడప అర్బన్‌ సీఐ దారెడ్డి భాస్కర్‌రెడ్డి, టుటౌన్‌ ఎస్‌ఐ అమర్‌నాథరెడ్డి తమ సిబ్బందితో కలిసి మృతదేహాన్ని, ఇంటిని పరిశీలించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. అయితే మృతురాలి తల్లిదండ్రులు మధురై నుంచి కడపకు వచ్చి ఫిర్యాదు చేసిన తర్వాత కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. భార్యాభర్త మధ్య ఏర్పడిన మనస్పర్థలే ఈ సంఘటనకు కారణమని భావిస్తున్నారు. పూర్తి వివరాలు ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తెలుస్తాయని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు