వివాహేతర సంబంధం నేరం కాదనడంతో..

2 Oct, 2018 03:13 IST|Sakshi

ప్రాణం తీసుకున్న భార్య

చెన్నైలోని భారతీనగర్‌కు చెందిన పుష్పలత రెండేళ్ల క్రితం జాన్‌పాల్‌ ఫ్రాంక్లిన్‌ అనే వ్యక్తిని పెళ్లిచేసుకుంది. ఈ పెళ్లిని ఇద్దరి కుటుంబాలూ వ్యతిరేకించాయి. దీంతో వీరిద్దరు వేరేచోట కాపురం పెట్టారు. వీరికి ఓ సంతానం కూడా కలిగింది. చెన్నైలోని ఓ పార్కులో ప్రస్తుతం ఫ్రాంక్లిన్‌ సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. భార్య పుష్పలతకు క్షయవ్యాధి సోకడంతో ఆమె ప్రస్తుతం చికిత్సపొందుతోంది. వ్యాధిసోకిన నాటి నుంచీ భార్యతో అన్యోన్యంగా ఉండటం మానేసిన ఫ్రాంక్లిన్‌.. ఆమెకు కనీస అవసరాలకు సైతం డబ్బు ఇవ్వడానికి నిరాకరించాడు.

దీంతో ఈ విషయాన్ని అతని స్నేహితులకు చెప్పడానికి పుష్పలత వెళ్లినపుడు ఫ్రాంక్లిన్‌కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు స్నేహితులు చెప్పారు. పార్కులో సెక్యూరిటీ గార్డు డ్యూటీ సమయం పూర్తయినా చాలా లేటుగా ఇంటికొస్తున్న భర్తను నిలదీసింది. ఆ మహిళతో వివాహేతర బంధాన్ని తెంచుకోవాలని తెగేసిచెప్పింది. అందుకు ఫ్రాంక్లిన్‌ తిరస్కరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. వివాహేతర బంధాలు నేరం కాదంటూ తాజాగా సుప్రీంకోర్టు తీర్పుచెప్పిందని, పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశమే లేదంటూ ఫ్రాంక్లిన్‌ సమర్థించుకున్నాడు.

దీంతో తీవ్ర నిరాశకు గురైన పుష్పలత శనివారం ఒంటరిగా ఉన్నపుడు ఉరి వేసుకుని ఆత్మహత్యచేసుకుంది. విషయం తెల్సిన పోలీసులు ఫ్రాంక్లిన్‌ను అదుపులోకి  తీసుకుని కేసు దర్యాప్తుచేస్తున్నారు. భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని 497వ సెక్షన్‌ కింద వివాహేతర (ఇరువురి సమ్మతితో) సంబంధాలు నేరం కాదని తాజాగా సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చిన తర్వాత ఈ అంశానికి సంబంధించిన తొలికేసుగా పుష్ప మరణాన్ని పరిగణిస్తున్నారు. అయితే ఐపీసీ సెక్షన్‌ 306 ప్రకారం.. ఆత్మహత్యకు ప్రేరేపించిన ఎలాంటి వివాహేతర సంబంధమైనా శిక్షార్హమైన నేరమే అవుతుంది.

మరిన్ని వార్తలు