మాతృప్రేమను మరిచి .. పంతానికి పోయి

29 Nov, 2019 08:12 IST|Sakshi
ఆత్మహత్యకు పాల్పడిన గది, హిరణ్మయి (ఫైల్‌)

పాపను నిద్రపుచ్చి.. తల్లి బలవన్మరణం

భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదమే కారణమా..? 

ఖాజాగూడలో  చోటుచేసుకున్న విషాద ఘటన

సాక్షి, గచ్చిబౌలి : భార్యాభర్తల మధ్య వచ్చిన స్వల్ప వివాదంతో మనస్తాపం చెందిన ఓ తల్లి.. పాలైనా విడువని పసికందును నిద్రలోకి నెట్టి బలవన్మరణానికి పాల్పడింది. నిద్రపోయిన పసికందు లేచిచూస్తే జోలపాడి జోకొట్టిన తల్లి మళ్లీ ఒడికి తీసుకుని పాలిచ్చి ఆకలి తీరుస్తుందనుకుంటే విగతజీవిగా ఫ్యానుకు వేలాడుతోంది. అమ్మకి ఏమైందో తెలియని పసికందు ఆకలికోసం ఏడుస్తున్న దృశ్యం చుట్టుపక్కల వారిని చలింపచేసింది. గురువారం ఉదయం రాయదుర్గం పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలోని సంగం జాగర్ల గ్రామానికి చెందిన పురోహితుడు రమేశ్‌బాబు పెద్ద కూతురు హిరణ్మయి (29)ని గుంటూరుకు చెందిన కృష్ణ కిశోర్‌కు ఇచ్చి 2018 ఆగస్టు 30న వివాహం జరిపించారు. హిరణ్మయి నగరంలోని విప్రోలో, కృష్ణ కిశోర్‌ సైబర్‌ గేట్‌వే సంస్థల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పని చేస్తూ.. ఖాజాగూడలోని స్వరూపా రెసిడెన్సీ 5వ అంతస్తులోని ఫ్లాట్‌ నం. ఇ–1 సింగిల్‌ బెడ్‌ రూమ్‌లో నివాసముంటున్నారు. ఈ క్రమంలో ఆర్నెల్ల క్రితం ఈ దంపతులకు కూతురు పుట్టింది.

కూరలో ఆయిల్‌ ఎక్కువైందని...
ప్రసవం అనంతరం పుట్టింటి నుంచి మూడు వారాల క్రితమే హిరణ్మయి భర్త వద్దకు రాగా.. అప్పట్నుంచి దంపతుల మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. గురువారం ఉదయం కూడా కూరల్లో ఆయిల్‌ ఎక్కువయిందన్న విషయంపై ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కృష్ణకిశోర్‌ యథావిధిగా ఉదయం ఆఫీసుకు వెళ్లగా.. మనస్తాపం చెందిన హిరణ్మయి ఇంట్లోనే పాపను నిద్రపుచ్చి బెడ్‌రూమ్‌లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే తండ్రి రమేశ్‌బాబు 9గంటలనుంచి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయకపోవడంతో.. మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తోన్న చిన్న కూతురు కౌముదికి విషయం చెప్పాడు.

దీంతో లంచ్‌ సమయంలో కౌముది ఖాజాగూడలోని సోదరి ఇంటికి వచ్చి తలుపుకొట్టగా ఎవరూ తీయలేదు. తలుపులు నెట్టుకుని లోపలికివెళ్లగా హాల్లో పసికందు మేదస్వీ ఏడుస్తూ...  హిరణ్మయి ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఉంది. ఇరుగుపొరుగు సాయంతో హిరణ్మయిని కిందికి దించి సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. పోలీసులకు సమాచారమివ్వడంతో మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం ఎస్సై ఎస్‌.రవీందర్‌ తెలిపారు. కాగా, హిరణ్మయి గది నుంచి బయటకు ఎక్కువగా రాదని, బుధవారం రాత్రికూడా హిరణ్మయి దంపతుల మధ్య గొడవ జరిగినట్లు అపార్ట్‌మెంట్‌ వాసులు చెబుతున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా