కుమారుడు పుట్టలేదని..

8 Jan, 2020 11:55 IST|Sakshi
ఆత్మహత్య చేసుకున్న సారమ్మ , వెంకటేశ్వరమ్మ

కర్నూలు, మిడుతూరు: కుమారుడు పుట్టలేదని మనస్తాపం చెంది ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.  మండలంలోని సుంకేసుల గ్రామంలో మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ గోపీనాథ్‌ తెలిపిన వివరాల మేరకు.. సుంకేసులకు చెందిన జగదీష్‌కు ఆత్మకూరు మండలం సిద్దపల్లె గ్రామానికి చెందిన సారమ్మతో 2000 సంవత్సరంలో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు.  కుమారుడు పుట్టలేదని సారమ్మ బాధపడుతుండేది. దీనికితోడు ఆమె రుతుక్రమం  సమయంలో కడపునొప్పితో ఇబ్బందిపడేది. ఈ రెండు కారణాలతో జీవితంపై విరక్తి చెంది ఇంటిలో ఎవ్వరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  మృతురాలి తండ్రి బాల ఏసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

మహిళ ఆత్మహత్య
 కర్నూలు(హాస్పిటల్‌):  నగరంలోని లాడ్జీలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. నంద్యాలకు చెందిన శేఖర్‌ శిరువెళ్ల మండలం ఎర్రగుంట్ల ఎస్‌బీఐ బ్యాంక్‌లో అసిస్టెంట్‌  మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య వెంకటేశ్వరమ్మ(34), ఒక కుమారుడు ఉన్నారు.  వెంకటేశ్వరమ్మ సోమవారం కర్నూలుకు వచ్చి బస్టాండ్‌ సమీపంలోని ఓ లాడ్జీలో గది అద్దెకు తీసుకుంది. మంగళవారం ఆమె గది తెరవకపోవడంతో అనుమానం వచ్చి లాడ్జీ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు తెరిచి చూడగా ఆమె క్రిమిసంహారక మందు తాగి మరణించినట్లు పోలీసులు గుర్తించారు. వ్యక్తిగత కారణాలతో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు