ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి ఆత్మహత్య

14 Dec, 2019 08:54 IST|Sakshi
వాసవి(ఫైల్‌)

సాక్షి, పాల్వంచ(ఖమ్మం) : ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ నర్సుగా పనిచేస్తున్న విద్యార్థిని ప్రేమ పేరుతో వేధింపులకు గురై, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామానికి చెందిన పూనెం వాసవి(17) అనే విద్యార్థిని పాల్వంచలోని సిద్ధార్థ ఒకేషనల్‌ నర్సింగ్‌ కళాశాలలో చదువుతుంది. టీచర్స్‌ కాలనీలో వరుసకు అన్న అయిన మాచర్ల గోపి ఇంట్లో రెండు నెలలుగా అద్దెకు ఉంటూ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ట్రైనీ నర్సుగా చేరింది. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన బంధువులు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం కొత్తగూడెం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందింది. అయితే కోయగూడెంకు చెందిన వరుసకు బంధువైన గీతారత్నం అనే యువకుడు ప్రేమ పేరుతో కొన్ని రోజులుగా వేధింపులకు దిగడం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని బాలిక తండ్రి శ్రీధర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం గీతారత్నం, అతని స్నేహితుడితో కలిసి వాసవి ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు దిగడంతో మనస్థాపం చెందిందని, ఈ విషయాన్ని తనకు ఫోన్‌లో కూడా చెప్పిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్‌ఐ ప్రవీణ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాసవి మృతితో కోయగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆస్పతి వద్ద విద్యార్థిని స్నేహితులు విలపించిన తీరు అక్కడున్న వారిని కలిచివేసింది.

మరిన్ని వార్తలు