భర్త వేధింపులపై భార్య ఫిర్యాదు

24 May, 2018 08:16 IST|Sakshi
ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చిన కలైవాణి

అన్నానగర్‌: భర్త వేధింపులపై భార్య తంజా వూరు పోలీసు సూపరింటెండెంట్‌కి ఫిర్యాదు చేసింది. తంజావూరు ముత్తమిళ్‌ నగర్‌కు చెందిన కలైవాణి (20) మంగళవారం జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ సెంథిల్‌కుమార్‌కు ఫిర్యాదు చేసింది. అందులో.. నేను ప్రస్తుతం తంజావూరు ముత్తమిళ్‌నగర్‌లో నివసిస్తున్నాను. నా తండ్రి పలు సంవత్సరాల కిందట కుటుంబాన్ని వదలి వెళ్లిపోయాడు. నా సోదరిని మేనమామకు ఇచ్చి వివాహం చేసేందుకు నిర్ణయించారు. వివాహం రోజున నా సోదరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ప్లస్‌–2 చదువుతున్న నన్ను బలవంతంగా మేనమామతో వివాహం చేశారు.

అతనికి నా కంటే 20ఏళ్లు వయస్సు ఎక్కువ. పెళ్లయినప్పటినుంచి నన్ను బానిసగా ఇంట్లోనే ఉంచి హింసిస్తున్నారు. తరచూ తాగి వస్తూ దాడి చేస్తున్నాడు. ఈ స్థితిలో 25.4.2018న ఇంటి నుంచి బయటికి వచ్చి తంజావూరులో మహిళా హాస్టల్‌లో ఉంటూ టైలరింగ్‌ చేస్తూ జీవిస్తున్నాను. అనంతరం న్యాయవాది ద్వారా విడాకులు కోరుతూ నోటీస్‌ పంపాను. నేను ఉన్న స్థలాన్ని తెలుసుకుని భర్త బంధువులతో వచ్చి నన్ను కిడ్నాప్‌ చేసి హత్య చేస్తానని బెదిరిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్తపై తగిన చర్యలు తీసుకోవాలని, వివాహానికి ఇచ్చిన కట్నం, నగలతో పాటు తన ఓటర్‌ ఐడీ, పాఠశాల సర్టిఫికెట్లను తిరిగి ఇప్పించాలని కోరారు. దీనిపై విచారణ జరిపి న్యాయం చేస్తామని పోలీసు సూపరింటెండెంట్‌ సెంథిల్‌కుమార్‌ భరోసా ఇచ్చారు.

మరిన్ని వార్తలు