లారీ ఢీకొని మహిళా హెచ్‌సీ మృతి

23 Aug, 2019 13:27 IST|Sakshi

పోలీస్‌...ఆ మూడు అక్షరాలు సాధనేతన ధ్యేయంగా భావించింది ఖాకీ దుస్తులే తనకు కవచ కుండలాలనుకుంది లాఠీ...శాంతి, భద్రతల అదుపునకు వజ్రాయుధమనుకుంది విజిల్‌...కూత ట్రాఫిక్‌ నియంత్రణకు లక్ష్మణ రేఖగా భాసించింది ,పేదరికమనే అవరోధం ఆడపిల్లనే ఆక్షేపణం అడుగడుగునా అడ్డుగా నిలిచినా అధిగమించి, అరోహించి ‘స్టార్‌’గా నిలవాలనే లక్ష్యం సాధించి పదోన్నతి సాధించి...అందరికీ ఆనందం పంచి అంతలోనే విషాదం నింపి జీవనం పయనం చాలించి...(పిఠాపురం పోలీసు స్టేషన్లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న విజయలక్ష్మి విధి నిర్వహణలో ఉండగానే రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. ఏఎస్సైగా పదోన్నతి పొంది... ఆ ఫలాలు ఆస్వాదించకుండానే లారీ చక్రాల కింద బంగారు భవిత నలిగిపోయింది.)

సాక్షి, తూర్పుగోదావరి(రంగంపేట) : రంగంపేట శివారు అట్టల ప్యాక్టరీ వద్ద ఏడీబీ రోడ్డుపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా హెడ్‌కానిస్టేబుల్‌ దుర్మరణం చెందారు. రంగంపేట ఏఎస్సై సుబ్బారావు కథనం ప్రకారం.. పిఠాపురం టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో మహిళాహెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కూటి విజయలక్ష్మి (47)గురువారం రాజమహేంద్రవరం కోర్టులో సాక్ష్యం చెప్పడానికి తన హోండా యాక్టివా బైక్‌పై వెళుతుండగా ఉదయం తొమ్మిది గంటలకు రంగంపేట శివారు అట్టల ఫ్యాక్టరీ వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి పెద్దాపురం నుంచి రాజానగరం వైపు వెళుతున్న లారీ బలంగా ఢీ కొట్టింది. విజయలక్ష్మిని కొంతదూరం ఈడ్చుకుపోయింది. టైర్ల కింద ఇరుక్కుపోయి ఆమె చనిపోయిందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ పరారయ్యాడని చెప్పారు. రంగంపేట వీఆర్వో శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, రంగంపేట ఇన్‌చార్జి ఎస్సైగా ఉన్న సామర్లకోట ఎస్సై వీఎల్‌వీకే సుమంత్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి తరలించామని తెలిపారు. 

మహిళా హెడ్‌కానిస్టేబుల్‌ మృతదేహాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ 
పెద్దాపురం: స్థానిక ఏడీబీ రోడ్డులో రంగంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పిఠాపురం పోలీస్‌ స్టేషన్‌ మహిళా కానిస్టేబుల్‌ కె.విజయలక్ష్మి మృతదేహాన్ని గురువారం జిల్లా ఎస్పీ నయీం అస్మీ పరిశీలించారు. విజయలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. పోలీస్‌ యంత్రాంగం నుంచి అందించాల్సిన సహాయక చర్యలు చేపట్టి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎస్‌బీ డీఎస్పీ సుంకర మురళీమోహన్,  పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్సై వెలుగుల సురేష్‌ తదితరులున్నారు.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ 
రంగంపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌ విజయలక్ష్మి మృతి చెందడంతో ప్రమాదస్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు సందర్శించారు.  

>
మరిన్ని వార్తలు