కట్నం వేధింపులు తాళలేక.. 

20 Aug, 2018 01:16 IST|Sakshi
మధురేఖ (ఫైల్‌)

మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య!

కడెం (ఖానాపూర్‌): కట్నం వేధింపులు తాళలేక ఓ మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడింది. నిర్మల్‌ జిల్లా కడెం పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న గుగ్లావత్‌ మధురేఖ (26) ఆదివారం స్టేషన్‌ క్వార్టర్స్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన మదన్, లక్ష్మీ దంపతుల కుమార్తె మధురేఖకు, నిర్మల్‌ జిల్లా పెంబి మండలానికి చెందిన గుగ్లావత్‌ శ్రీనివాస్‌తో 3 నెలల క్రితం వివాహమైంది. మధురేఖ తొలుత లక్సెట్టిపేట్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసి నెలన్నర క్రితం ఇక్కడికి బదిలీపై వచ్చింది.

ఆదివారం ఉదయం విధులకు హాజరుకావాల్సిన మధురేఖ స్టేషన్‌కు రాకపోవడంతో హోంగార్డు శాంత ఆమె క్వార్టర్స్‌కు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో కిందపడిపోయి ఉంది. దీంతో ఎస్సైకి సమాచారం అందించి ఖానాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అల్లుడి వేధింపులు భరించలేక తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముజాహిద్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు