కుందూలో మూడో మృతదేహం లభ్యం 

24 Sep, 2019 10:37 IST|Sakshi
కాకనూరు వెంకట లక్షుమ్మ (ఫైల్‌), కొట్టాల గ్రామ సమీపంలో కుందూనదిలో గాలింపు చేస్తున్న ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సభ్యులు, పోలీసులు

సాక్షి, కడప(రాజుపాళెం) : మండలంలోని కుందూనదిలో గాదెగూడూరుకు చెందిన కాకనూరు వెంకటలక్షుమ్మ (45) మృతదేహాన్ని సోమవారం సాయంత్రం కనుగొని ఒడ్డుకు చేర్చారు. ఇప్పటికే కాకనూరు తిరుపతిరెడ్డి, ఆయన కుమార్తె కాకనూరు ప్రవళిక మృతదేహాలను పోలీసులు కుందూనదిలో కనుగొన్న విషయం తెలిసిందే.  గత గురువారం మండలంలోని గాదెగూడూరు గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఈముగ్గురు అదృశ్యంపై రాజుపాళెం ఎస్‌ఐ లక్ష్మీప్రసాదరెడ్డి మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూలూరు–కొట్టాల గ్రామాల మధ్య తిరుపతిరెడ్డి ద్విచక్ర వాహనం ఉండటంతో ఈ ముగ్గురు కుందూనదిలో దూకి ఉండవచ్చునని అనుమానంతో పోలీసులు నదిలో తెప్పల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. 

ఐదు రోజులుగా ఎస్‌ఐ లక్ష్మీప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో  మైదుకూరు మండలంలోని ఏకర్లపాళెంకు చెందిన గజ ఈతగాళ్లు, కర్నూలుకు చెందిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం సభ్యులు, రాజుపాళెం ఏఎస్‌ఐ సుబ్బారెడ్డి, పోలీసులు చంద్రానాయక్, ఓబులేసు   కుందూనదిలో వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ  కష్టపడి ముగ్గురి మృతదేహాలను కనుగొన్నారు. ఆ మృతదేహాలు కుందూలో లభ్యం కావడంతో తిరిగి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేపడతామన్నారు. 

ప్రజల నుంచి ఎస్‌ఐ, పోలీసులకు ప్రశంసలు..
కాకనూరు తిరుపతిరెడ్డి, ఆయన భార్య వెంకటలక్షుమ్మ, కుమార్తె ప్రవళిక మృతదేహాలను కుందూనదిలో నీటి ఉధృతి అధికంగా ఉన్నా కష్టపడి ఐదురోజులుగా గజ ఈతగాళ్ల సాయంతో వెలికితీయడంతో ప్రజలు పోలీసుల తీరును ప్రశంసిస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా