ఫ్రెండ్‌తో కలిసి వెళ్లింది.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య!

25 Aug, 2019 12:46 IST|Sakshi

సాక్షి, గన్నవరంజ/కృష్ణా: ఓ ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో గన్నవరం శివారు మర్లపాలెంలోని చెరువులో శవమై తేలిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల అందించిన వివరాలు.. స్థానిక రామ్‌నగర్‌ కాలనీలో నివసిస్తున్న గోచిపాత పుష్పలత(30) ఆరేళ్ల కిందట ఏలూరులోని శనివారపుపేటకు చెందిన చోడగిరి అనిల్‌కుమార్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి ఉమామహేశ్వరి వద్ద మూడేళ్ల నుంచి పుష్పలత ఉంటోంది. తొలుత ప్రైవేట్‌ స్కూల్స్‌లో పనిచేసిన పుష్పలత ఇటీవల కేసరపల్లిలోని ఐటీ పార్కులోని మేధా టవర్స్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో చేరింది. అయితే వివాహం అయినప్పటి నుంచి పుష్పలతకు ఆమె భర్త అనిల్‌కుమార్‌తో మనస్పర్థలున్నాయి. ఆరు నెలల కిందట అనిల్‌కుమార్‌ ఏలూరు వెళ్లిపోయి ఉంటున్నాడు. అప్పటి నుంచి పుష్పలతతో తరచూ భర్త ఫోన్‌చేసి గొడవ పడుతుండేవాడు. ఆమె భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడని తెలుసుకున్న పుష్పలత తీవ్ర మనస్తాపానికి గురై వారం రోజులుగా ఉద్యోగానికి కూడా వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో హనుమాన్‌జంక్షన్‌లో ఉంటున్న స్నేహితురాలి ఇంటికి వెళ్లివస్తానని తల్లికి చెప్పి శనివారం సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై వెళ్లింది. తిరిగి రాత్రి 8.15 గంటలకు తల్లికి ఫోన్‌ చేసి ఏలూరు వెళ్తునని పుష్పలత చెప్పింది.

చెరువులో శవమై..
మర్లపాలెంలోని చెరువులో పుష్పలత శవమై తేలడాన్ని ఆదివారం తెల్లవారుజామున గ్రామస్తులు గుర్తించారు. తొలుత చెరువు గట్టున హ్యాండ్‌ బ్యాగ్‌తో కూడిన వాహనం పార్కింగ్‌ చేసి ఉండి, కొద్ది దూరంలో వాచ్, కళ్లజోడు ఉండడం గమనించారు. చుట్టూ పరిశీలించగా మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ వెనుక చెరువులో మృతదేహం తేలి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఎస్‌ఐ వాసిరెడ్డి శ్రీనివాస్‌ హ్యాండ్‌ బ్యాగ్‌లోని బ్యాంక్‌ పాస్‌బుక్‌ ఆధారంగా ఆమె పుష్పలతగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె తల్లి ఉమామహేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనిల్‌కుమార్‌ వేధింపులతో కుమార్తె మృతి చెందినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పుష్పలతది హత్య? ఆత్మహత్య అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.


 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు