ఖాకీ నిర్లక్ష్యం ప్రాణం తీసింది!

2 Jan, 2020 04:04 IST|Sakshi
లోకేశ్వరిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు (ఫైల్‌). (ఇన్‌సెట్‌లో) లోకేశ్వరి

లోకేశ్వరి ఫిర్యాదు పట్టించుకోని పోలీసులు

విరక్తి చెంది ఆత్మహత్యాయత్నం

చికిత్స పొందుతూ మృతి

పంజగుట్ట: జరగరానిది జరిగినప్పుడు హడావుడి చేసే పోలీసులు ఆపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. నగరంలోని పంజగుట్ట పోలీసుస్టేషన్‌ వద్ద మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసి, బుధవారం ఉస్మా నియా ఆస్పత్రిలో మృతిచెందిన లోకేశ్వరి ఉదంతమే దీనికి నిదర్శనం. చెన్నైకి చెందిన లోకేశ్వరి (37) శ్రీనివాస్‌ను 2000లో వివాహం చేసుకుంది. కుమార్తె పుట్టిన తర్వాత వీళ్లు విడిపోయారు. లోకేశ్వరికి 2012లో మాట్రిమోనియల్‌ సైట్‌ ద్వారా నగరంలోని వారసిగూడకు చెందిన ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ పరిచయమయ్యాడు.

2013లో ఆమెను నగరానికి తీసుకువచ్చిన ప్రవీణ్‌  ఆమెతో సహజీవనం కొనసాగించాడు. అప్పట్లో సోమాజిగూడలో నగల దుకాణం నిర్వహించారు.  మనస్పర్థలు రావ డంతో లోకేశ్వరిపై ప్రవీణ్‌ 2014లో పంజగుట్ట పోలీసుస్టేషన్‌లో చోరీ కేసు నమోదు చేయించాడు. ఈ కేసులో అరెస్టయి బెయిల్‌పై వచ్చిన ఆమె.. కుమార్తెను తీసుకుని చెన్నై వెళ్లిపోయింది.

కేసు నమోదు చేయని పోలీసులు... 
ప్రవీణ్‌ తనకు రూ.7.5 లక్షలు ఇవ్వాలని లోకేశ్వరి చెబుతోంది. అతనికి ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో స్నేహితుడు కన్నన్‌తో శుక్రవారం ఇక్కడికి వచ్చింది. ప్రవీణ్‌ కోసం వెతికినా దొరక్కపోవడం, ఫోన్‌లో అందుబాటులోకి రాకపోవడం తో శుక్రవారమే పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రవీణ్‌ను ఫోన్‌ ద్వారా సంప్రదించిన పోలీసులు అతడి మాటలు నమ్మి కేసు నమోదు చేసేది లేదంటూ లోకేశ్వరితో చెప్పేశారు. దీంతో ఏసీపీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్న ఆమె ఆ పేరుతో ఫిర్యాదును సిద్ధం చేయించి మంగళవారం పంజగుట్ట ఠాణా వద్దకు వచ్చింది.

2 లీటర్ల పెట్రోల్‌ను తన వెంట తెచ్చుకుంది. ప్రవీణ్‌ మోసం.. పోలీసులు ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో ఆవేదన చెందిన లోకేశ్వరి ఠాణా ముందే ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుంది. 70 శాతం కాలిన ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు వెంట ఉన్న కన్నన్‌ను మంగళవారమే అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ పేరుతో లోకేశ్వరి సిద్ధం చేసిన లేఖను మాయం చేశారు. బుధవారం లోకేశ్వరి మృతిచెందడంతో పోస్టుమార్టం నిర్వహించి ఆమె వస్తువుల్ని కన్నన్‌కు అప్పగించి రహస్యంగా చెన్నైకు పంపించేశారు. బుధవారం ప్రవీణ్‌పై చీటింగ్, ఆత్మహత్యకు ప్రేరేపించడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పంజగుట్ట పోలీసులు త్వరలోనే అరెస్టు చేస్తామని చెబుతూ నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు.

ప్రవీణ్‌ను ఫోన్‌లో సంప్రదించాం: తిరుపతన్న, పంజగుట్ట ఏసీపీ  
‘2014లో లోకేశ్వరిపై నమోదైన కేసు అదే ఏడాది లోక్‌ అదాలత్‌లో రాజీ అయింది. తాజాగా లోకే శ్వరి శుక్రవారం పంజగుట్ట పోలీసుస్టేషన్‌కు వచ్చి ప్రవీణ్‌పై ఫిర్యాదు చేసింది. దీనిపై ఎస్సై.. ప్రవీణ్‌ను ఫోన్‌లో సంప్రదించారు. లోకేశ్వరి ఆరోపణల్ని ఖండించిన ప్రవీణ్‌.. తాను బెంగళూరులో ఉన్నానని, 2 వారాల్లో వస్తానని చెప్పాడు. ఆర్థిక కారణాల నేపథ్యంలో ఆమె కుటుంబం మృతదేహాన్ని చెన్నై తీసుకువెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించే స్థితిలో లేదని తెలిసింది.

మరిన్ని వార్తలు