బాత్‌రూమ్‌లో ప్రసవం

2 Oct, 2017 16:15 IST|Sakshi
ఆస్పత్రిలో సంధ్య, పక్కనే బిడ్డ

విజయనగరం, సాలూరు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సుఖ ప్రసవం చేయించుకోండని ప్రచారాలు చేస్తోంది సర్కార్‌. తీరా అక్కడకు వెళితే ఎంత సురక్షితమో సాలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఈ సంఘటన రుజువు చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. పాచిపెంట మండలం పెద చీపురువలస గ్రామానికి చెందిన చెల్లూరి సంధ్య అనే గర్భిణి తొలికాన్పు కోసం సాలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం రాత్రి సంధ్యకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో స్థానిక ఆశ వర్కర్‌ సాయంతో 108కు ఫోన్‌ చేసి సాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి రాత్రి 11 గంటల సమయంలో చేర్చారు. వేకువ జామున 3.30 గంటల సమయంలో ఆమె బాత్‌రూమ్‌కు వెళ్లారు. అనుకోకుండా అక్కడే ప్రసవం జరరగడంతో ఆమె పెద్ద కేకలు వేసి అక్కడే కుప్ప కూలిపోయింది. అయితే ఆమె ఆస్పత్రిలో చేరే సమయంలో స్థానిక సిబ్బంది ఎవరూ విధుల్లో లేరు.

గర్భిణితో వచ్చిన ఆమె పెద్దమ్మ బిడ్డకు ఎలాంటి ప్రమాదం జరగకుండా పట్టుకున్నారు. ఆశ వర్కర్‌ సపర్యలు చేశారు. ఒక్క క్షణం ఆలస్యమైన తమకు బిడ్డ దక్కేవాడు కాదని, లెట్రిన్‌ డొక్కులో పడిపోయేవాడని వారు చెబుతున్నారు. ఆ సమయంలో ఆస్పత్రి మొత్తం సిబ్బంది కోసం పరుగులు తీసినా ఎవరూ కనిపించ లేదని ఆశవర్కర్‌ సుశీల తెలిపారు. తీరా అంతా జరిగిన అరగంట తర్వాత నర్సులు, డాక్టర్‌ వచ్చి పరిశీలించారని పేర్కొన్నారు. తల్లిబిడ్డ క్షేమంగా ఉండడం వల్ల తనకు ఇబ్బంది లేదని, ఒక వేళ జరగరానిది జరిగితే తన పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నిస్తున్నారు. అత్యవసర సమయాల్లో సిబ్బంది కనిపించకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలని ఆమె తెలిపారు.

ఆ తల్లికి కడుపుకోతే మిగిలింది
విజయనగరం, సాలూరురూరల్‌ (పాచిపెంట): కళ్లు తెరవకముందే ఓ పసిగుడ్డు కన్నుమూసింది. నవ మాసాలు కనిపెంచిన బిడ్డ తన కళ్లేదుటే విగత జీవుడై పడి ఉండడాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేక పోతుంది. వెక్కి వెక్కి ఏడుస్తూ తనకు కడుపు కోతే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. పాచిపెంట మండలం కర్రివలస గ్రామానికి కొంపంగి సరస్వతి కాన్పు కోసం పుట్టిల్లు అయిన మోసూరు వచ్చారు. ఆమెకు సెప్టెంబర్‌ 29న పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే కుటుంబీకులు 108 వాహనంలో రాత్రి 8.30 గంటల సమయంలో సాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. 10.30 సమయంలో ఆమె ఓ పాపకు జన్మనిచ్చారు. ఏమైందో ఏమో మరుసటి రోజు ఉదయం 5.30 గంటల సమయంలో ఆ పాప చనిపోయింది. దీంతో ఆ తల్లి పెద్ద పెట్టున రోదిస్తున్నారు. అయితే పాప మరణానికి గల కారణాలు తెలియరాలేదు.

మరిన్ని వార్తలు