పాఠశాలలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌

25 Feb, 2020 09:50 IST|Sakshi
తరగతి గదిలోకి దూసుకువచ్చిన ట్రాక్టర్‌ (ఇన్‌సెట్‌) జయలక్ష్మి (ఫైల్‌) 

మధ్యాహ్న భోజన వర్కర్‌ మృతి

జాతీయ జెండా దిమ్మె ధ్వంసం, కూలిన తరగతి గది గోడ

భోజనంవేళ కావడంతో విద్యార్థులకు..

తప్పిన పెను ప్రమాదం

డ్రైవర్‌ మద్యం మత్తులో ట్రాక్టర్‌ నడిపాడని ఆరోపణలు

సాక్షి, మధిర : డ్రైవర్‌ మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేయడంతో ట్రాక్టర్‌ ప్రభుత్వ పాఠశాలలోకి దూసుకుపోయింది. వంట చేస్తున్న మధ్యాహ్న భోజన వర్కర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని రామచంద్రాపురం ప్రాథమిక పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. పాఠశాల హెచ్‌ఎం ఆదినారాయణ కథనం ప్రకారం... మండల పరిధిలోని రామచంద్రాపురం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తరగతులు పూర్తయిన అనంతరం మధ్యాహ్న భోజనం చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో పంతంగి నర్సింహారావు అనే ట్రాక్టర్‌ డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండి ట్రాక్టర్‌ నడిపాడు. ఆ ట్రాక్టర్‌ అదుపుతప్పి పాఠశాలలోకి దూసుకువచ్చి అక్కడే వంటచేస్తున్న వంట మనిషి జాన్‌పాటి లక్షి్మ(65)ని ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పాఠశాలకు ప్రహరీ లేకపోవడం, నర్సింహారావు మద్యం మత్తులో అతివేగంగా ట్రాక్టర్‌ నడపడంతో అదుపుతప్పి పాఠశాల ఆవరణలోకి దూసుకుపోయింది.

ఈ ఆవరణలో ఉన్న జాతీయ జెండా దిమ్మెసైతం ధ్వంసమైంది. ఈ దిమ్మెను ఢీకొట్టి తరగతిగదిలోకి దూసుకుపోవడంతో తలుపులు, తరగతి గోడసైతం కుప్పకూలిపోయాయి. హఠాత్పరిణామంతో.. అతిసమీపంలో ఉన్న విద్యార్థులందరూ భయంతో పరుగులు తీశారు. తరగతి గదిలోనే విద్యార్థులు ఉన్నట్లయితే ఈ సంఘటనలో ఎంత ప్రాణనష్టం జరిగి ఉండేదోనని ఆ సంఘటన తీరును చూసిన గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేశారు. మృతురాలి భర్త గతంలోనే చనిపోయాడు. ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. లక్ష్మి సుమారు 15 సంవత్సరాలుగా ఇదే పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంట తయారు చేస్తోంది.

రోజూ నాణ్యమైన భోజనాన్ని తయారుచేయడం, విద్యార్థులతో కలిసిపోవడం, గ్రామస్తులతో కలివిడిగా ఉండే లక్ష్మి మృతిని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. వైరా ఏసీపీ సత్యనారాయణ, మండల విద్యాశాఖాధికారి వై.ప్రభాకర్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని మధిర ప్రభుత్వ సివిల్‌ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్‌ఐ లవణ్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు