పట్టిసీమ శివరాత్రి ఉత్సవాల్లో విషాదం

4 Mar, 2019 15:38 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : పోలవరం మండలం పట్టిసీమ వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. భక్తుల‌ మధ్య జరిగిన తొక్కిసలాటలో జరిగి ఒక వృద్దురాలు మృతి చెందారు. శివరాత్రి సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి నుంచే వేలాది మంది పట్టిసీమ చేరుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తడంతో అధికారులు వారిని నియంత్రించలేకపోయారు. ఈ క్రమంలో రద్దీ ఎక్కువ కావడంతో క్యూలైన్లోనే ఎక్కువసేపు నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవైపు ఎండ.. మరోవైపు సరైన వసతులు లేకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భక్తులను గోదావరి దాటించడానికి అధికారులు ప్రయత్నిస్తున్న క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు మృతి చెందగా.. పలువురు అస్వస్థతకు గురయ్యారు.
 

ఇదిలా ఉండగా... అంచనాలకు మించి ఈరోజు మధ్యాహ్నం సమయానికి సుమారు డెబ్భై వేల మంది భక్తులు చేరుకోవడంతో పట్టిసీమ వద్ద గోదావరిపై రవాణా అస్తవ్యస్తంగా మారింది. దీంతో రద్దీని అదుపు చేయలేక అధికారులు నానాతంటాలు పడుతున్నారు. రద్దీ ఎక్కువ కావడం సహా గోదావరిలో నీటి మట్టం తగ్గిపోవడంతో పడవలు నెమ్మదిగా వెళ్లాల్సి వస్తోంది. అదేవిధంగా అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో గంటల తరబడి క్యూలైన్లలో నిలబడటం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సుమారు 50 నుంచి 60 మంది భక్తులు స్పృహ కోల్పోయారు. వెంటనే అక్కడికి చేరుకున్న వైద్య ఆరోగ్య శాఖా సిబ్బంది వైద్యం అందించడంతో అపాయం తప్పింది. రద్దీకి తగ్గట్లుగా భక్తులకు సౌకర్యాలను అమర్చడంలో అధికారులు విఫలమయ్యారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని అదుపు చేయడంలో రెవెన్యూ, పోలీసు, అధికార యంత్రాంగాలు విఫమయ్యాయని మండిపడుతున్నారు. సాయంత్రం నుంచి రాత్రికి పట్టిసీమకు వచ్చే భక్తుల సంఖ్య మరొక లక్ష దాటుతుందని, అప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు