ఆపరేషన్‌ వికటించి మహిళ మృతి

17 Sep, 2019 08:19 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న సుధారాణి తల్లీ, చెల్లి, (అంతర చిత్రం) సుధారాణి(ఫైల్‌)

వైద్యురాలి నిర్వాకమే కారణమని పోలీసులకు ఫిర్యాదు

న్యాయం కోసం కుటుంబ సభ్యుల పోరాటం

సాక్షి, పీఎం పాలెం(భీమిలి): కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ కోసం ఓ వివాహిత నగరంలోని ఓ ఆస్పత్రిలో చేరితే విగతజీవిగా ఇంటికి వచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు 25 రోజుల పాటు ఆస్పత్రిలో ఉంచి లక్షలాది రూపాయలు ఫీజుగా వసూలు చేసి, ఆరోగ్యంగా వెళ్లిన యువతిని నిర్జీవిగా పంపించారని మృతురాలి బంధువులు ఆక్షేపిస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మధురవాడ చంద్రంపాలెం దరి దుర్గానగర్‌కు చెందిన కె.విమల(మృతురాలి తల్లి), కె.కుసుమకుమారి (మృతురాలి చెల్లెలు) తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

చంద్రంపాలెం దుర్గానగర్‌కు చెందిన కె.విమలకుమారి పెద్ద కుమార్తె సుధారాణి(42) భర్త నుంచి విడిపోయి ఇద్దరు పిల్లలతో తల్లి వద్ద ఉంటోంది. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన కె.డేవిడ్‌ అనే వ్యక్తిని ఈ ఏడాది జూలై 10న రెండో వివాహం చేసుకుంది. అతని తొలి భార్య మరణించగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో ఇద్దరికీ రెండో వివాహమే. ఇప్పటికే మొత్తం నలుగురు పిల్లలు ఉండడంతో ఇక చాలని కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకోవాలని సుధారాణి నిశ్చయించుకుంది. ఆగస్టు 12న నగరంలోని వివేకానంద ఆస్పత్రిలో చేరింది. అక్కడ డాక్టర్‌ శాంతాకుమారి కుటుంబ నియత్రణ ఆపరేషన్‌ చేశారు. ఆ సమయంలో ఏమి జరిగిందో కాని ఆమె పరిస్థితి విషమించడంతో వివేకానంద ఆస్పత్రి నుంచి మరుసటి రోజు 13న మైక్యూర్‌ ఆస్పత్రికి డాక్టర్‌ శాంతాకుమారి హుటాహుటిన తరలించారు.

అక్కడి వైద్యులు పరీక్షించి సుధారాణి ఊపిరితిత్తులు, గండె, లివర్, కిడ్నీ పని చేయడం లేదని, వెంటనే ఆపరేషన్‌ చేయాలని చెప్పారు. 14న ఆపరేషన్‌ చేయగా కడుపులో పెద్దపేగు కట్‌ అయిందని, దాని మూలంగా రోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలిపారు. మైక్యూర్‌ ఆస్పత్రిలోనే ఆగçస్టు 31వ తేదీ వరకూ ఐసీయూలో వెంటిలేటర్‌ ద్వారా చికిత్స అందించారు. పరిస్థితి మరింత విషమించిందని ఆస్పత్రి బిల్లు రూ.8.5 లక్షలు కట్టించుకుని కేజీహెచ్‌కు తరలించడం మంచిదని చెబుతూ డిశ్చార్జ్‌ చేశారని సుధారాణి తల్లీచెల్లి విమల, కుసుమకుమారి వివరించారు. అప్పటికే వైద్య ఖర్చులకు మరో రూ.4 లక్షలకు పైగా అయిందన్నారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతుండగా ఈ నెల 4న సుధారాణి చనిపోయింది.

‘ఠాగూర్‌’సినిమా చూపించారు..
కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స కోసం వెళితే తమకు ఠాగూర్‌ సినిమాలా కథ నడించారని మృతురాలి తల్లి ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయంపై ఆగస్టు 17న డీసీపీ–1కు, నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లోనూ ఫిరాదు చేశామని తెలిపారు. ఇప్పటికీ పోలీసులు డాక్టర్‌ శాంతాకుమారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరారు.   

మరిన్ని వార్తలు