సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

27 Nov, 2019 03:15 IST|Sakshi
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని సోహిని సక్సేనా (ఫైల్‌)

బస్సుకు బలి

తాత్కాలిక డ్రైవర్‌ నిర్వాకం

స్కూటీతో సహా వెనుక చక్రాల కిందపడిన సోహిని సక్సేనా

హెల్మెట్‌ ఉన్నా.. తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి

బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 12లో దుర్ఘటన

బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–12లో మంగళవారం మధ్యాహ్నం తాత్కాలిక డ్రైవర్‌ నడుపుతున్న ఆర్టీసీ బస్సు ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిని చిదిమేసింది. ఈ ప్రమాదంలో ఉద్యోగిని తన స్కూటీతో బస్సు వెనుక చక్రాల కింద పడిపోయారు. ఆమె తల హెల్మెట్‌తో సహా ఛిద్రమైపోయిం ది. ఆమెను 50 మీటర్ల మేర, స్కూటీని వంద మీటర్ల మేర బస్సు ఈడ్చుకెళ్లింది. స్థానికులు దాడిచేసి, చెప్పే వరకు ఇంత ఘోరం జరిగినట్టు తెలియదని ఆ బస్సు డ్రైవర్‌ అంటున్నాడు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని గ్రీన్‌ బంజారా కాలనీలో నివసించే సోహిని సక్సేనా (35) కొండాపూర్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) హెచ్‌ఆర్‌ విభాగంలో ఉన్నత స్థానంలో పనిచేస్తున్నారు. ఆమె భర్త వినీత్‌కుమార్‌ మాధూర్‌ గచ్చిబౌలిలోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో సీనియర్‌ మేనేజర్‌. 

ముంబైకి చెందిన వీరు వివాహానంతరం హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డారు. వీరికి నాలుగేళ్ల వయసున్న కవలలు ఉన్నా రు. మంగళవారం మధ్యాహ్నం 12.50 గం టల ప్రాంతంలో సోహిని స్కూటీపై (ఏపీ09సీఎం 1852) రోడ్‌ నంబర్‌ 12 ప్రధాన రహదారి మీదుగా బయల్దేరారు. ఆ రోడ్డులో ఉన్న శ్మశానవాటిక వైపు నుంచి విరించి ఆస్పత్రి వైపు వెళ్తున్నారు. అదే సమయంలో బర్కత్‌పుర డిపో ఆర్టీసీ బస్సు (ఏపీ28జెడ్‌ 1217) శిల్పారామం నుంచి కోఠి వైపు వెళ్తోంది.

దీన్ని తాత్కాలిక డ్రైవర్‌ అడ్డాల శ్రీధర్‌ (34) నడుపుతున్నాడు. శ్మశానవాటిక ప్రాంతం లో రోడ్డు పల్లంగా ఉంటుంది. దీంతో బస్సు వేగం పెరిగి రోడ్డు పక్క నుంచి వెళ్తున్న సోహిని స్కూటీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. సోహిని కిందపడిపోయారు. బస్సు వెనుక టైరు తలపై ఎక్కడంతో హెల్మెట్‌తో సహా ఛిద్రమై ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇది గమనించని డ్రైవర్‌ శ్రీధర్‌ బస్సును ముందుకు పోనిచ్చాడు. సోహిని మృతదేహాన్ని దాదాపు 50 మీటర్ల మేర బస్సు ఈడ్చుకెళ్లింది. అక్కడ ఆమె మృతదేహం పడిపోగా, స్కూటీని మరో 100 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది.

అరుస్తున్నా వినిపించుకోని డ్రైవర్‌..
స్థానికులు, బస్సు వెనుక వస్తున్న వారు అరుస్తున్నా డ్రైవర్‌ వినిపించుకోలేదు. పింఛన్‌ కార్యాలయం చౌరస్తాలో రెడ్‌ సిగ్నల్‌ పడటంతో డ్రైవర్‌ బస్సును ఆపాడు. కొందరు ఆగ్రహావేశాలతో బస్సు ఎక్కి, జరిగింది చెబుతూ డ్రైవర్‌ శ్రీధర్‌ను చితకబాదారు. బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. శ్రీధర్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యక్ష సాక్షుల ద్వారా ఆధారాలు సేకరించారు. డ్రైవర్‌ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి ఇక్బాల్‌ పోలీసులకు తెలిపాడు. కాగా, సోహిని మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం     నిర్వహించారు. మార్చురీ వద్ద భర్త వినీత్‌ సక్సేనా, బంధువులు.. సోహిని మృతదేహం వద్ద రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. టీసీఎస్‌లో సోహినీతో పనిచేసే సహోద్యోగులు పెద్దసంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. 

ఆలస్యంగా వెళ్లడమే..
సోహిని రోజూ ఉదయం 10 గంటలకు కార్యాలయానికి బయల్దేరి వెళ్తారు. మంగళవారం ఆలస్యంగా బయల్దేరడమే ఆమె పాలిట శాపమైంది. కొండాపూర్‌కు మాసబ్‌ట్యాంక్, మెహిదీపట్నం మీదుగా వెళ్లడానికి ఆమె ప్రయత్నించారా? లేక పింఛన్‌ ఆఫీస్‌–విరించి చౌరస్తాలో ‘యూ’టర్న్‌ తీసుకొని తిరిగి రోడ్‌ నంబర్‌–12 మీదుగా వెళ్లాలనుకున్నారా? అనేది స్పష్టం కాలేదు. మృతురాలి భర్త ఫిర్యాదుతో బస్సు డ్రైవర్‌ శ్రీధర్‌పై ఐపీసీ సెక్షన్‌ 304 (ఏ) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

రానంటే పిలిచి బస్సెక్కించారు..
బ్రేక్‌ ఫెయిల్యూర్‌ వల్లే ప్రమాదం జరిగిందని బర్కత్‌పుర డిపో తాత్కాలిక డ్రైవర్‌ శ్రీధర్‌ అన్నాడు. సంఘటన గురించి అతను చెబుతూ.. ‘మంగళవారం మధ్యాహ్నం కొండాపూర్‌లో ప్రయాణికులను ఎక్కించుకొని జూబ్లీహిల్స్‌ మీదుగా బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12 నుంచి విరించి ఆస్పత్రి చౌరస్తా వైపు వెళ్తున్నాను. శ్మశానవాటిక వద్ద స్కూటీ నడుపుతూ యువతి కనిపించింది. బస్సు వేగాన్ని తగ్గించాలని బ్రేకు వేయగా పని చేయలేదు. ఎంత ప్రయత్నించినా బస్సు ఆగలేదు. అంతలో బస్సు డివైడర్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. ఈలోగా స్థానికులు నాపై దాడి చేశారు. అప్పటి వరకు నాకు బస్సు కిందపడి మహిళ చనిపోయిందన్న విషయం తెలియదు. 

ఉప్పల్‌లో ప్రైవేట్‌ స్కూల్‌ మినీ బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నా. ఇటీవల తాత్కాలిక డ్రైవర్లు కావాలని చెప్పడంతో బర్కత్‌పుర డిపోలో దరఖాస్తు చేసుకున్నాను. 20 డ్యూటీలు చేశాను. మంగళవారం డ్యూటీకి వెళ్లే ఉద్దేశంలో లేను. డిపో నుంచి ఫోన్‌చేసి డ్యూటీకి రావాలని పిలిచారు. అప్పటికప్పుడు సిద్ధమై వెళ్లాను. డిపోలో మెకానిక్‌లు బస్సు సామర్థ్యాన్ని పరిశీలించాకే డ్రైవర్‌కు ఇవ్వాలి. ఈ రోజు ఏ బస్సు తీసుకెళ్లాలని అడగ్గా, తనిఖీ చేయకుండానే ఆ బస్సు బాగుందంటూ అప్పగించారు. బ్రేక్‌ ఫెయిల్యూర్‌ వల్లే ప్రమాదం జరిగినట్టు ఆర్టీసీ అధికారులకు కూడా చెప్పాను’.

బస్సు ఫిట్‌నెస్‌తో ఉంది: డిపో మేనేజర్‌
ప్రమాదానికి కారణమైన బస్సు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉందని బర్కత్‌పుర డిపో మేనేజర్‌ వెంకట్‌రెడ్డి చెప్పారు. ఘటన స్థలాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్రైవర్‌ శ్రీధర్‌ ఇప్పటికి 15 డ్యూటీలు చేశాడని, మంగళవారం కూడా డ్యూటీకి పంపామన్నారు. హెవీ మోటార్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్న అతనికి గతంలో స్కూల్‌ బస్సు నడిపిన అనుభవం కూడా ఉందన్నారు. అందుకే విధుల్లోకి తీసుకున్నామన్నారు.

మృతురాలి పిల్లలు

మరిన్ని వార్తలు