హ్యాపీ హోలీ అంటూ దారుణం

30 Mar, 2019 09:06 IST|Sakshi

మహిళా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కాల్చివేత

లైసెన్సు కాన్సిల్‌ చేసినందుకు పగబట్టిన కెమిస్ట్‌

అధికారిని కాల్చి చంపి, ఆపై ఆత్మహత్య

చండీగఢ్‌ : నిజాయితీగా పనిచేస్తున్న ఎఫ్‌డీ (ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ ఎడ్మినిస్ట్రేషన్) జోనల్ లైసెన్సింగ్ అథారిటీ మహిళా అధి​కారిపై పగబట్టాడో ప్రబుద్ధుడు. అక్రమంగా నిర్వహిస్తున్న షాపు లైసెన్స్‌ను రద్దు చేసిందనే అక్కసుతో డాక్టర్‌ నేహా శౌరి(36)ను కాల్పి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకున్న ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటన రెండు కుటుంబాల్లో  తీవ్ర విషాదానికి దారి తీసింది.

పంజాబ్ రాజధాని చండీగఢ్ సమీపంలోని ఖరార్ డ్రగ్ అండ్ కెమికల్ టెస్టింగ్ లాబోరేటరీ వద్ద శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడిని మోరిండాకు చెందిన కెమిస్ట్‌ షాప్‌ ఓనర్‌ బల్విందర్‌సింగ్‌(50)గా గుర్తించారు.  

పోలీసు అధికారి హర్‌చరణ్‌ సింగ్‌ భుల్లార్ అందించిన సమాచారం ప్రకారం  శుక్రవారం ఉదయం మోటార్‌బైక్‌పై వచ్చిన బల్విందర్‌ సింగ్‌ నేరుగా నేహా ఆఫీసులోకి  చొరబడి ఆమెపై కాల్పులు జరిపాడు. హ్యాపీ హోలీ  అంటూ అరుచుకుంటూ సంఘటనా స్థలంనుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే ల్యాబ్‌లోని ఉద్యోగి సురేష్ కుమార్ అతన్ని వెంబడించి, మోటార్‌ బైక్‌ స్టార్ట్‌ చేస్తుండగా పట్టుకున్నాడు. దీంతో బల్విందర్‌ మొదట సురేష్‌పై కాల్పులకు ప్రయత్నించాడు. కానీ బైక్‌ను వెనుకకు లాగడం మూలంగా అతను పడిపోయాడు. ఇక దొరికిపోతాననే ఆందోళనలో తనను తాను కాల్చుకున్నాడు. ఇద్దరినీ ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే నేహా మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. మరోవైపు చికిత్స పొందుతూ  బల్విందర్‌ సింగ్‌ కూడా చనిపోయాడు.

2009లో అక్రమంగా విక్రయిస్తున్న మాదకద్రవ్యానికి బానిసలైనవారుపయోగించే 35 రకాల టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు నేహా. దీనికి సంబంధించిన సరియైన పత్రాలను చూపించకపోవడంతో ఆమె బల్విందర్‌ దుకాణం లైసెన్సును రద్దు చేశారు. ఈ విషయం త్వరలోనే కోర్టు ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆమెపై పగ తీర్చుకోవాలని పథకం వేశాడు. ఇందుకోసం  మార్చి 9న  ఆయుధాల లైసెన్సును తీసకున్నాడు. అంతేకాదు రెండు రోజుల క్రితం  రివాల్వర్‌ను కూడా కొనుగోలు  చేశాడు. 

సంఘటనా స్థలంతో రివాల్వర్‌తోపాటు, సింగ్‌ వద్ద ఒక కత్తిని కూడా స్వాధీనం చేసుకున్న అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ సంఘటనపై పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌  అమరీందర్ సింగ్ సమగ్ర దర్యాప్తునకు డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.  కాగా నేహాకు రెండేళ్ల కుమార్తె,  భర్త వరుణ్‌ మంగా (బ్యాంకు ఉద్యోగి) ఉన్నారు. సింగ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక  కుమారుడు ఉన్నారు.

మరిన్ని వార్తలు