హెచ్‌ఐవీ దాచి పెళ్లి.. భర్తపై కేసు నమోదు

8 Jan, 2020 17:14 IST|Sakshi

ముంబై : తనకు వచ్చిన రోగాన్ని దాచి తనతో పాటు తన భార్య జీవితాన్ని నాశనం చేశాడు ఓ దుర్మార్గపు భర్త. తనకు హెచ్‌ఐవీ సోకిందన్న నిజాన్ని దాచి.. ఆమె నూరేళ్ల జీవితంతో ఆడుకున్నాడు. చివరకు నిజం తెలుసుకొని నిలదీసిన భార్యపై నిందలు మోపారు. కోడలు వల్లనే తమ కుమారుడికి ఈ పాడురోగం సోకిందంటూ అత్త, మామలు దొంగ ఏడుపులు ఏడ్చారు. తమ కుమారుడిని వెనుకేసుకొస్తూ నిజాన్ని కప్పిపుచ్చారు. చివరికి కోర్టు ఆదేశాల మేరకు అతనిపై కేసు నమోదు అయింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర లోని నవీ ముంబైలో చోటు చేసుకుంది.

వివరాలు.. థానే జిల్లాలోని డోంబివ్లీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి(31) ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కామోథేకు చెందిన ఓ యువతి(26)ని 2016లో వివాహం చేసుకున్నాడు. కాగా, అంతకు ముందే అతనికి హెచ్‌ఐవీ సోకింది. ఈ విషయం అతని కుటుంబీకులకు కూడా తెలుసు. ఈ దారుణ విషయాన్ని కప్పిపుచ్చి వివాహం చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత అతని ఇంటికి వచ్చిన  ఓ బంధువు.. మందులు వాడుతున్నావా అని అడగడంతో అతని భార్యకు అనుమానం కలిగింది. మందులు ఎందుకు... ? ఏమైందని అని అడుగగా.. దాటవేసే ప్రయత్నం చేశారు. అత్తమామలను నిలదీయగా క్షయ వ్యాది సోకిందని, మందులు వాడితే తగ్గిపోతుందని నచ్చజెప్పారు. ఓ రోజు భర్తతో పాటు ఆస్పత్రికి వెళ్లిన యువతి.. డాక్టర్ల ద్వారా అతనికి హెచ్‌ఐవీ సోకిందని తెలుసుకుంది.

వెంటనే ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పి.. వారితో కలిసి మరో ఆస్పత్రికి వెళ్లి రక్త పరీక్షలు నిర్వహించగా.. హెచ్‌ఐవీ పాజిటీవ్‌గా తేలింది. ఈ విషయంపై అత్తమామలను నిలదీయగా.. తిరిగి ఆమెపైనే నిందలు వేశారు. ‘ నీ వల్లనే మా కుమారుడికి హెచ్‌ఐవీ సోకింది’ అంటూ తిరిగి ఆమెనే నిందించారు. దీంతో ఆమె న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. తన జీవితాన్ని నాశనం చేసిన భర్త, అత్తమామలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు యువతి భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. 

మరిన్ని వార్తలు