కంప్రెషర్‌ పేలి మహిళకు తీవ్రగాయాలు

27 Mar, 2020 11:26 IST|Sakshi
వైద్యపరీక్షలు అందజేస్తున్న వైద్యులు

పరిస్థితి విషమం.. భర్తపై అనుమానం

గద్వాల క్రైం: అసెంబ్లింగ్‌ కూలర్ల తయారు, ఫ్రిజ్‌ల మరమ్మతు చేస్తున్న ఒకరి ఇంట్లో ప్రమాదవశాత్తు కంప్రెషర్‌ పేలడంతో ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన పట్టణంలోనిషేరెల్లివీధిలో గురువారం చోటుచేసుకుంది. బంధువులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. షెరెల్లివీధికి చెందిన బుర్రాన్‌ద్దిన్, నయూమ భార్యభర్తలు. బుర్రాన్‌ద్దిన్‌ ఇంటి వద్దే సొంతంగా అసెంబ్లింగ్‌ కూలర్లు తయారుచేయడంతోపాటు రిఫ్రిజిరేటర్లకు మరమ్మతు, ఫినాయిల్‌ తయారుచేస్తూ ఉపాధి పొందుతున్నారు. అయితే మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భార్య నయూమ కూలర్‌కు పెయింట్‌ వేస్తున్న క్రమంలో ఓ కంప్రెషర్‌ ప్రమాదవశాత్తు పేలింది. దీంతో మహిళ కుడి చేయి మణికట్టు వరకు తెగిపోగా.. ముఖం సగా భాగం చీద్రమైంది. భారీ పెలుడు సంభవించడంతో కాలనీ ప్రజలు ఏం జరిగిందోనని తెలుసుకునే లోపే రక్తపు మడుగులో మహిళ పడి ఉండడం గమనించారు. దీంతో వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు  ప్రథమ చికిత్స అందించి..మెరుగైన చికిత్స కోసం కర్నూల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

భర్తపై అనుమానం..
పెబ్బేరు మండలం సూగూరుకు చెందిన బుర్రాన్‌ద్దిన్‌కు గద్వాలకు చెందిన నయూమతో గతంలో వివాహమైంది. అనంతరం గద్వాలలోనే జీవనం సాగిస్తుండగా.. భార్యభర్తల మధ్య తరచూ ఘర్షణ వాతావరణం ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే భర్త హత్య చేయాలనే ఉద్దేశంతో ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇద్దరు ఒకే చోట పనిచేస్తున్న క్రమంలో భర్తకు ఎలాంటి గాయం కాకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. ఈ సంఘటనపై నయూమ బంధువులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని విచారణ చేపడతామని ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.  

మరిన్ని వార్తలు