ప్రియుడితో కలిసి భర్త హత్య

15 Feb, 2018 09:48 IST|Sakshi
నిందితుల అరెస్టు చూపుతున్న డీఎస్పీ, సీఐ

రామ్‌నాథ్‌ హత్య కేసులో భార్య, ఆమె ప్రియుడి అరెస్టు

167 గ్రాముల బంగారు నగలు, సెల్‌ఫోన్లు స్వాధీనం

మదనపల్లె క్రైం: ఈ నెల 9వ తేదీన జరిగిన రామ్‌నాథ్‌ కేసును పోలీసులు మూడు రోజుల్లోనే  ఛేదించారు. ప్రియుడితో కలిసి భార్యే భర్తను హతమార్చినట్టు తేల్చారు. ఈ మేరకు భార్యను, ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. డీఎస్పీ ఎం.చిదానందరెడ్డి, సీఐ సురేష్‌కుమార్‌ బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. తంబళ్లపల్లె మండలం రేణుమాకులపల్లె పంచాయ తీ తిమ్మయ్యగారిపల్లెకు చెందిన కందల నరసింహులు, నరసమ్మ కుమారుడు రామ్‌నాథ్‌ మదనపల్లె మున్సిపల్‌ ఇంజినీర్‌ వద్ద అసిస్టెంటుగా పనిచేస్తున్నాడు. అతనికి నాలుగేళ్ల క్రితం వైఎస్సార్‌ కడప జిల్లా రాజంపేట గరుగుపల్లె పంచాయతీ ఈడిగపల్లెకు చెందిన ఏఎన్‌ఎం లక్ష్మితో వివాహమైంది. వారికి పిల్లలు లేరు. కొంతకాలంగా ఇద్దరు గొడవ పడుతున్నారు.

లక్ష్మి భర్తతో తాను పడుతున్న కష్టాలను కడప బుడ్డాయపల్లెకు చెందిన తన మాజీ ప్రియుడు వాకా రామాంజనేయులు(30)కు చెప్పింది. భర్త అడ్డు తొలగించుకుంటే రూ.లక్షల ఆస్తి దక్కుతుందని, ఇద్దరూ కలిసి దుబాయ్‌లో స్థిరపడవచ్చని పేర్కొం ది. పథకం ప్రకారం ఈ నెల 9వ తేదీ రాత్రి కడప నుంచి ప్రియున్ని సీసీ కెమెరాలకు చిక్కకుండా విజయనగర్‌కాలనీకి రప్పించింది. భర్త రామ్‌నాథ్‌ భోజనం చేసి నిద్రలోకి జారుకున్నాక రామాంజనేయులుతో కలిసి గొంతు నులిమి హతమార్చింది. అనంతరం 167 గ్రాముల బంగారు నగలు, కురవంకలోని ఆమె పేరున ఉన్న రెండు ప్లాట్ల పత్రాలు, ఓ కారు, కొంత నగదును ప్రియుడికి ఇచ్చి కడపకు పంపేసింది.

దొంగలు రావడంతో గుండె ఆగిందని నాటకం
భర్త హత్యపై అనుమానం రాకుండా ఉండేందుకు లక్ష్మి నాటకం ఆడింది. వేకువజామున 4:30 గంటల సమయంలో తన భర్త రామ్‌నాథ్‌ బాత్‌రూమ్‌కు వెళ్లేందుకు తలుపులు తెరవగా ఐదుగురు ముసుగు దొంగలు ఇంట్లో చొరబడి భయపెట్ట డంతో గుండె ఆగి చనిపోయాడని పేర్కొంది. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ చిదానందరెడ్డి, సీఐ సురేష్‌కుమార్, ఎస్‌ఐ క్రిష్ణయ్య  పరిశీలించారు. అక్కడి పరిస్థితిని బట్టి పథకం ప్రకారం జరిగిన హత్యగా గుర్తించారు. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి కడపలో రామాంజనేయులును, మదనపల్లెలో లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు లక్ష్మి అంగీకరించిందని డీఎస్పీ తెలిపారు. వారి నుంచి 167 గ్రాముల బంగారు నగలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. కేసును ఛేదించిన సీఐ, ఎస్‌ఐలకు ఎస్పీ ఆదేశాల మేరకు రివార్డులు అందజేయనున్నామని వివరించారు.

>
మరిన్ని వార్తలు