మద్యం కోసం రూ.51 వేలు పోగొట్టుకున్న మహిళ

11 Nov, 2019 17:00 IST|Sakshi

పుణే: ఆన్‌లైన్‌లో ఆల్కహాల్‌ ఆర్డర్‌ చేసి రూ.51వేలు పోగొట్టుకున్నారు ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఈ ఘటన గత శనివారం పుణేలో చోటు చేసుకుంది. వివరాలు.. కోల్‌కతాకు చెందిన 32ఏళ్ల మహిళా ఇంజనీర్‌ నాలుగురోజుల క్రితం పుణే వెళ్లారు. బవ్ధాన్‌లోని తన స్నేహితులను కలిసిన ఆమె.. వారితో కలిసి పార్టీ చేసేందుకు సమీపంలోని బార్‌కు వెళ్లారు. అయితే అయోధ్య తీర్పు సందర్భంగా ఆ రోజు మద్య దుకాణాలు బంద్‌ చేశారు. దీంతో స్నేహితులతో కలిసి ఇంటికి వెళ్లిన ఆమె ఎలాగైనా పార్టీ చేసుకోవాలని డిసైడ్‌ అయ్యారు. ఆన్‌లైన్‌లో మద్యం డెలివరీ కోసం ప్రయత్నించారు. ఆన్‌లైన్‌లో ఒక మొబైల్‌ నెంబర్‌ కనిపించడంతో దానికి ఫోన్‌ చేశారు. ఫోన్‌ రిసీవ్‌ చేసుకున్న ఓ వ్యక్తి.. మద్యం దుకాణాన్ని మూసేశామని, ఆల్కహాల్‌ దొరకడం కష్టమని చెప్పాడు. అయితే ఎలాగైనా తన ఇంటికి ఆల్కహాల్‌ చేరవేయాలని ఆమె కోరింది.

దీంతో ఆయన ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించాలని చెప్పాడు. దీనికి సమ్మతించిన మహిళా సాఫ్టవేర్‌... వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ)ను ఆ అగంతకుడుకి చెప్పేశారు. కొద్ది నిమిషాల్లోనే ఆమె బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి రూ.31,777 విత్‌డ్రా అయినట్లు మెసేజ్‌ వచ్చింది. దీంతో ఆమె ఆ అగంతకుడికి ఫోన్‌ చేసి వివరణ అడిగారు. పొరపాటు జరిగిందని, మరోసారి ఓటీపీ చెప్తే అమౌంట్‌ జమ చేస్తానని నమ్మించాడు. దీంతో ఆమె మరోసారి ఓటీపీ చెప్పింది. మళ్లీ రూ.19,001 విత్‌డ్రా చేసేశాడు. మెసేజ్‌ చూసుకున్న ఆమె అతనికి ఫోన్‌ చేయగా.. అందుబాటులోకి రాలేదు. మోసపోయానని తెలుసుకున్న సదరు మహిళ.. స్నేహితులతో కలిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పుణే పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు