నాన్నా నన్ను క్షమించు..  

31 Oct, 2019 10:39 IST|Sakshi

జూలకల్‌ ఎంపీఈఓ ఆత్మహత్య

కారణాలపై సూసైడ్‌నోట్‌ 

సాక్షి, కర్నూలు :  ‘నాన్నా క్షమించు.. నాకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని నువ్వు బాధపడుతుంటే చూడలేకపోతున్నా. నాకు బతకాలని లేదు. ఈ లోకంలో ఉండలేకున్నా. అమ్మను బాగా చూసుకో. అక్కను ఇంటికి తెచ్చుకో. బావ బాగా చూసుకోవడం లేదు. మీరున్నంత వరకు అక్కను మీతోనే ఉంచుకోండి.  నేను చచ్చిపోయాక మృతదేహాన్ని అక్క, అన్న, చెల్లెలికి చూపొద్దు. దయచేసి నా కోరిక తీర్చండి’ అంటూ గూడూరు మండలం జూలకల్‌లో కాంట్రాక్టు పద్ధతిన వ్యవసాయ విస్తరణ అధికారి (ఎంపీఈఓ)గా పని చేస్తున్న భజంత్రీ శివప్రియాంక (22) సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకుంది. పాణ్యం గ్రామానికి చెందిన వీరభద్రుడు, లక్ష్మిదేవి రెండో కుమార్తె శివప్రియాంక. ఈమె రెండేళ్లుగా జూలకల్‌ ఎంపీఈఓగా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తోంది. మరో ఎంపీఈఓ మంజులతో కలిసి కర్నూలులోని సీతారాంనగర్‌లో గది అద్దెకు తీసుకుని ఉండేది.


శివప్రియాంక సూసైడ్‌నోట్‌ 

బుధవారం ఉదయం మంజుల విధులకు వెళ్లిన తర్వాత శివప్రియాంక డ్యూటీకి వెళ్లకుండా గది తలుపులు మూసి.. ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంజుల సాయంత్రం తిరిగి వచ్చేసరికి గది తలుపులు మూసి ఉన్నాయి. గట్టిగా తట్టినప్పటికీ తెరుచుకోకపోవడంతో ఇరుగూపొరుగువారి సాయంతో బద్దలు కొట్టారు. శివ ప్రియాంక ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. నాల్గవ పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. గదిలో ఉన్న సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకుని.. ఇరుగూ పొరుగు వారిని విచారించారు. ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు కారణం సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్న అంశాలేనా? లేక ఇతరత్రా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులను విచారిస్తే తప్ప పూర్తి సమాచారం వచ్చే అవకాశం లేదని నాల్గవ పట్టణ సీఐ మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. 

మరిన్ని వార్తలు