కొడుకే కాలయముడు

12 Jan, 2018 09:50 IST|Sakshi
పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు ఇల్లుమల్ల మాధవరావు

సాయమ్మ హత్య కేసులో వీడిన మిస్టరీ

పోలీసుల ఎదుట లొంగిపోయిన పెద్ద కుమారుడు మాధవరావు

అరెస్టు చేసి కోర్టుకు తరలింపు

ఆస్తి తగాదాలే కారణం

శ్రీకాకుళం,వజ్రపుకొత్తూరు: చిన్నమురహరిపురం గ్రామానికి చెందిన ఇల్లుమల్ల సాయమ్మ హత్య కేసులో మిస్టరీ వీడింది. పెద్దకుమారుడు ఇల్లుమల్ల మాధవరావు తన తల్లితో ఉన్న ఆస్తి తగాదాలు కారణంగా హత్య చేసినట్టు ఒప్పుకొని వజ్రపుకొత్తూరు పోలీ సుల ఎదుట బుధవారం లొంగిపోయా డు. కాశీబుగ్గ రూరల్‌ సీఐ ఎస్‌.తాతా రావు కేసు పూర్తి వివరాలను విలేకరులకు గురువారం వెల్లడించారు. హత్యకు గురైన సాయమ్మకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు మాధవరావు ఉపాధి కోసం రాజమండ్రిలో ఉండగా, రెండో కుమారుడు ధనరాజ్‌ బీఎస్‌ఎఫ్‌ జవాన్‌గా పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు శ్రీనివాసరావు ఇంటివద్దే ఉంటున్నాడు. ఈ తరుణంలో తనకు ఆస్తిలో వాటా కావాలని పెద్ద కుమారుడు మాధవరావు తరచూ తల్లి సాయమ్మతో గొడవలు పడేవాడు.

ఆస్తి వాటా కోసం గ్రామానికి చెందిన పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. చిన్న కుమారుడు శ్రీనివాసరావుకు వివాహం అయిన వరకు వాటాలు ఇవ్వనని సాయమ్మ తెగేసి చెప్పింది. అయితే పెద్దమనుషులు ఒప్పించి సాయమ్మ నుంచి మాధవరావుకు రెండు చిన్న పల్లపు మడులుతో పాటు 15 జీడి, క్బొరి చెట్లును వాటాగా ఇప్పించారు. దీనికి మాధవరావు ఒప్పుకోక మూడున్నర ఎకరాల తోటలో వాటా కావాలంటూ కోరడంతో ఆమె ఒప్పకోలేదు. తోటవైపు కూడా రావద్దంటూ హెచ్చరించింది. దీంతో కోపంతో మాధవరావు ఇచ్చిన వాటా కూడా సాగు చేయలేదు. దీంతో గత ఏడాది అక్టోబర్‌లో తనకు వాటా కావాలంటూ లాయర్‌ నోటీసులను పంపిన సాయమ్మ, మిగతా ఇద్దరు అన్నదమ్ములు నుంచి స్పందన కనిపించలేదు. ఈ తరుణంలో మాధవరావు కుటుంబ పోషణ కోసం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వెళ్లి అక్కడ పోలవరం, ఏలేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుల వద్ద కాలువ పనుల్లో చేరాడు.

అయితే తనకు ఆస్తి ఉండి కూడా ఇన్ని ఇబ్బందులు పడుతున్నానంటూ ఆవేదన చెంది, ఇదంతా తన తల్లివల్లేనని భావించి తల్లి సాయమ్మను చంపివేస్తే ఆస్తిలో వాటాతో పాటు తన పేరుమీద నామినీ ఉన్న ఎల్‌ఐసీ పాలిసీల సొమ్ము కూడా వస్తుందని ఆలోచించి గత నెల 20వ తేదీన పూరి–తిరుపతి రైలులో పూండి వచ్చి వారి తోట వద్ద మాటు వేశాడు. సాయమ్మ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన జీడి తోటలో వంట చెరకు కోసం కంపలు ఏరుతుండగా వెనుక నుంచి వచ్చిన మాధవరావు ఆమె తలపై కర్రతో బలంగా మోదాడు. ముందుకు పడిపోయిన ఆమె తలను భూమిలోకి ఆనించి చంపేసి తిరిగి రాజమండ్రి వెళ్లిపోయాడు. ఏమీ ఎరుగనట్టు మళ్లీ రాజమండ్రి నుంచి పూండి చేరుకున్నాడు. తన కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిసి అటూ ఇటూ తిరిగి చివరకు పోలీసుల ఎదుట లొంగిపోయాడని సీఐ తాతారావు చెప్పారు. దీంతో ఆయనను అరెస్ట్‌ చేసి టెక్కలి మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరు పరిచిన అనంతరం పాతపట్నం జైలుకు రిమాండ్‌కు తరలించినట్టు ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు