కాటేసిన కాసుల వల

1 Feb, 2020 11:50 IST|Sakshi

 భర్త దూరమై ఆర్థికంగా చితికిన వివాహిత

కొడుకు భవిష్యత్‌ కోసం ఆందోళన

నమ్మకంగా వ్యభిచార వృత్తిలోకి దింపిన ఓ మహిళ  

డబ్బులు అడిగినందుకు హత్యకు గురైన వైనం

పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు   

గుంటూరు:భర్తకు దూరమై ఒంటరిగా బతుకుతున్న ఆ మహిళ తన కొడుకును ఉన్నతంగా తీర్చిదిద్దాలని భావించింది. కానీ ఆ తల్లి ఆర్థిక పరిస్థితులు అందుకు సహకరించవని నిర్ధారించుకుంది. అప్పుల బాధలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సమయంలో ఓ వ్యభిచార గృహ నిర్వాహకురాలి ఉచ్చులో పడింది. తాను పుండైనప్పటికీ కుమారుడికి పండంటి జీవితాన్ని ఇవ్వాలని ఆకాంక్షించింది. కాసుల కోసం చీకటి గదిలో కన్నీటిని దిగమింగింది. కానీ ఆ చిల్లర డబ్బుల కోసం తానే చితిపైకి చేరుతుందని ఊహించలేకపోయింది. డబ్బులు అడిగిన నేరానికి నమ్మకంగా వ్యభిచారవృత్తిలోకి దించిన మహిళ, ఆమె భర్త, మరో వ్యక్తి కలిసి ఆమెను మట్టుబెట్టారు. కొడుకును ఉన్నతంగా చూసుకోకుండానే కాటికి పంపించారు.  

హతమార్చిందిలా ...
విశ్వసనీయ సమాచారం ప్రకారం... పిడుగురాళ్లకు చెందిన ఓ వివాహిత మూడేళ్ల క్రితం భర్తతో ఏర్పడిన వివాదాలతో ఎనిమిదేళ్ల కుమారుడితో కలసి వేరుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. అయినా కుమారుడ్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని భావించింది. ఏ పని చేసినా కుటుంబం గడవడానికే సరిపోవడం లేదు. ఈ క్రమంలో నరసరావుపేటలో వ్యభిచార గృహ ఓ నిర్వాహకురాలు పరిచయమైంది. ఆమె వద్దకు వెళ్లగా మూడు రోజులపాటు నరసరావుపేటలోనే ఉంచింది. ముందుగా ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వాలని సదరు మహిళ కోరింది. వ్యభిచార నిర్వాహకురాలు చెప్పినంత డబ్బులు చెల్లించకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నిర్వహకురాలి భర్త కూడా వివాహితను దుర్భాషలాడారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వివాహిత హెచ్చరించింది. పోలీసుల వద్దకు వెళితే సమస్య వస్తుందని నిర్వాహకురాలు భయపడింది.  దీంతో ఆమెను మట్టుబెట్టాలని పథకం రచించారు. ఈ ఏడాది జనవరి రెండో వారంలో డబ్బు ఇస్తామని నమ్మించి వివాహితను నరసరావుపేట పిలిపించారు. పార్టీ చేసుకుందామని నమ్మించి వ్యభిచార నిర్వాహకురాలు, ఆమె భర్త, ఓ విటుడు, వివాహితను గుత్తికొండ పరిసర ప్రాంతంలోని సాగర్‌ కాలువ వద్దకు తీసుకెళ్లారు. కాలువ గట్టున అందరూ మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న వివాహితను నిర్ధాక్షిణ్యంగా వ్యభిచార నిర్వాహకురాలు, ఆమె భర్త కాలువలోకి నెట్టేశారు. వివాహిత మృతి చెంది నీటిలో కొట్టుకుపోయిందని నిర్ధారించుకున్న    అనంతరం అక్కడ నుంచి వెళ్లారు. 

గతంలోను ఇదే తరహాలో..
సుమారు పదేళ్ల కిరతం చిలకలూరిపేటలో వ్యభిచార వృత్తి నిర్వహించడానికి వచ్చిన ఓ యువతిని సదరు నిర్వాహకురాలు హత్య చేసినట్టు గుర్తించారు. చిలకలూరిపేట రూరల్‌ స్టేషన్‌లో ఈమెపై హత్య కేసు నమోదైనట్టు పోలీసుల విచారణలో   తేలినట్టు సమాచారం.   

వెలుగు చూసిందిలా...
తమ కుమార్తె నరసరావుపేటకు వచ్చి ఆచూకీ లేకుండా పోయిందని జనవరి 21న మృతురాలి తల్లి, బంధువులు నరసరావుపేట వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అప్పటికే నకరికల్లు వద్ద గుంటూరు బ్రాంచ్‌ కెనాల్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని అక్కడ పోలీసులు గుర్తించారు. దీంతో మిస్సింగ్‌ మిస్టరీ వీడింది. దీంతో మిస్సింగ్‌ కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు కూపీ లాగారు. వ్యభిచార గృహ నిర్వాహకురాలు, ఆమె భర్తను అదుపులోకి తీసుకొని విచారించారు. వివాహితను తామే హతమార్చినట్లు వారు    అంగీకరించారు.

మరిన్ని వార్తలు