పెద్దమ్మను ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశాడు..

10 Nov, 2019 15:42 IST|Sakshi

ప్రాణం తీసిన బంగారం వివాదం

గుంటూరు జిల్లాలో ఘటన 

కర్లపాలెం(బాపట్ల): బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకున్న తన బంగారాన్ని తనకు ఇవ్వాలని అడిగిన సొంత పెద్దమ్మను.. ఓ యువకుడు ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన ఘటన గుంటూరు జిల్లా కొత్తపాలెంలో శనివారం చోటు చేసుకుంది. చందోలు ఎస్‌ఐ మణికృష్ణ తెలిపిన మేరకు.. కొత్తపాలెంకు చెందిన డేగల శ్రీనివాసరెడ్డి భార్య సుబ్బమ్మ (50)కు చెందిన 16 సవర్ల బంగారాన్ని చెరుకుపల్లి మండలం మార్వాకపాలెంలో ఉంటున్న ఆమె చెల్లెలు పగడం శ్యామల, చెల్లెలి కుమారుడు రాజశేఖరరెడ్డి మూడేళ్ల క్రితం బాపట్ల, చెరుకుపల్లి బ్యాంకుల్లో తాకట్టు పెట్టి నగదు తీసుకున్నారు. 

ఆ నగదును సుబ్బమ్మ, శ్యామల సొంత ఖర్చులకు వినియోగించుకున్నారు. కొంతకాలం తరువాత బ్యాంకుల్లో ఉన్న తన బంగారం విడిపించమని, తాను తీసుకున్న నగదును సుబ్బమ్మ  రాజశేఖర్‌రెడ్డికి ఇచ్చింది. అయితే బంగారం తెచ్చి ఇవ్వకపోవడంతో పలుమార్లు గొడవలు జరిగి గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. ఈ నేపథ్యంలో రాజశేఖర్‌రెడ్డి మట్టితోలే పనుల నిమిత్తం ట్రాక్టర్‌ వేసుకుని కొత్తపాలెం గ్రామానికి వచ్చాడు. సుబ్బమ్మ ట్రాక్టర్‌ తీసుకుని తన ఇంటి వద్ద పెట్టి.. బంగారం ఇచ్చిన తర్వాత తీసుకెళ్లాలని చెప్పింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ‘నిన్ను ట్రాక్టర్‌తో తొక్కి చంపేస్తాను.’ అంటూ రాజశేఖర్‌రెడ్డి ట్రాక్టర్‌ను ముందుకు పోనివ్వడంతో.. బంపర్‌పై కూర్చున్న సుబ్బమ్మ ట్రాక్టర్‌ చక్రాల కింద పడిపోయింది. స్థానికులు ఆమెను రాంబొట్లవారిపాలెంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.


మృతురాలు సుబ్బమ్మ

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా