సహజీవనం చేస్తున్న మహిళ హత్య

12 Jan, 2019 12:51 IST|Sakshi
లక్ష్మీ మృతదేహం

సహజ మరణంగా చిత్రీకరించేందుకు యత్నం

మృతదేహంపై గాయాలను గుర్తించిన స్థానికులు

పోలీసులకు ఫిర్యాదు

నేరాన్ని అంగీకరించిన ప్రియుడు

కృష్ణాజిల్లా, ఆరుగొలను (హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌): సహజీవనం చేస్తున్న యువతిని దారుణంగా హత్య చేసిన ఘటన ఆరుగొలనులో శుక్రవారంచోటుచేసుకుంది.వివరాలు.. శ్రీకాకుళం జిల్లా సొంపేట మండలం మొగలు కొత్తూరుకు చెందిన జాటియా లక్ష్మి (24)తో రెండేళ్ల క్రితం అదే జిల్లాలోని పాత్రుని వలస గ్రామానికి చెందిన మంగి రామరాజుకు పరిచయం ఏర్పడింది. అప్పటికే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా లక్ష్మిని ప్రేమపేరుతో నమ్మించాడు. తన భార్యను విడిచి పెట్టి పెళ్లి  చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ నేపథ్యంలో ఎనిమిది నెలల క్రితం ఇద్దరు శ్రీకాకుళం జిల్లా నుంచి పారిపోయి ఆరుగొలను వచ్చారు. ఇక్కడి తిప్పనగుంట రోడ్డులోని ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. వీరికి రెండు నెలల క్రితం బాబు పుట్టాడు. ఇటీవల రామరాజు భార్య శ్రీదేవి, ఆచూకీ తెలుసుకుని ఆరుగొలను రావటంతో వివాదం చెలరేగింది. భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా మరో యువతితో రామరాజు సహజీవనం చేయటాన్ని ఇరువర్గాల పెద్దలు కూడా వ్యతిరేకించారు. దీంతో మొదటి భార్య శ్రీదేవి, ఇద్దరు పిల్లలను కూడా ఆరుగొలను తీసుకువచ్చి అందరం కలసి ఒకే ఇంట్లో ఉందామని రామరాజు తరచూ లక్ష్మిపై ఒత్తిడి తేవటంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఫూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చిన రామరాజుకు లక్ష్మికి మధ్య మరోమారు ఈ విషయంపై వాగ్వాదం జరిగింది. మొదటి భార్యను తీసుకొచ్చి కలసి ఒకే చోట ఉండేందుకు లక్ష్మి ఒప్పుకోకపోవడంతో రామరాజు ఆవేశంతో ఊగిపోయాడు. మద్యం మత్తులో ఉన్న రామరాజు ఆగ్రహంతో తాడు తీసుకుని లక్ష్మి మెడకు గట్టిగా బిగించటంతో ఆమె ప్రాణాలువిడిచింది.

భార్య ఆపస్మారక స్థితిలో ఉందంటూ..
శుక్రవారం ఉదయం ఏమి తెలియనట్లుగా తన భార్య నిద్ర లేవటం లేదని, ఆపస్మారక స్థితిలో పడి ఉందని ఇరుగుపొరుగు వాళ్లను రామరాజు నమ్మించాడు. ఇప్పటికే లక్ష్మీ బాలింత రావటంతో ఏమైనా అనారోగ్యంతో మృతి చెంది ఉండవచ్చని అందరికి చెప్పాడు. దీంతో లక్ష్మి మరణించిన విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని స్థానికులు కోరారు. లక్ష్మి కుటుంబ సభ్యులు వచ్చేందుకు ఆలస్యమవుతుందని, అంత్యక్రియలు పూర్తి చేసేందుకు హడావుడి చేయటంతో అతడిపై అనుమానం మరింత బలపడింది. అదే సమయంతో మెడ మీద గాయాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో హనుమాన్‌జంక్షన్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ ఎన్‌.రాజశేఖర్, ఎస్‌ఐ వి.సతీష్‌ మృతదేహాన్ని పరిశీలించారు. తక్షణమే రామరాజును అదుపులోకి తీసుకుని విచారించారు. చేసిన తప్పును ఒప్పుకున్నాడు. ఘటనపై హనుమాన్‌జంక్షన్‌ సీఐ ఎన్‌.రాజశేఖర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు