వెంబడించి.. కర్రతో మోది..

29 Jan, 2020 07:30 IST|Sakshi
వివరాలు సేకరిస్తున్న డీసీపీ, సీఐ, లలిత మృతదేహం

సవతితల్లి దారుణ హత్య

కుటుంబ కలహాలే కారణం

దీన్‌దయాళ్‌నగర్‌లో ఘటన  

నేరేడ్‌మెట్‌: సవతితల్లి దారుణ హత్యకు గురైన ఘటన నేరేడ్‌మెట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని దీన్‌దయాళ్‌నగర్‌లో మంగళవారం సాయంత్రం జరిగింది. కుటుంబ కలహాలే హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్టు నేరేడ్‌మెట్‌ సీఐ నర్సింహస్వామి తెలిపారు.  సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. వినాయకనగర్‌లో నివాసం ఉంటున్న యాదగిరి (60) మొదటి భార్య భారతమ్మ రెండేళ్ల క్రితమే మరణించింది. యాదగిరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కొడుకు వేణుగోపాల్‌ విజయవాడలో ఉంటున్నాడు. పాల వ్యాపారం చేసే చిన్నకొడుకు కృష్ణప్రసాద్‌తో కలిసి యాదగిరి వినాయకనగర్‌లో ఉంటున్నాడు. రైల్వే లో టెక్నిషియన్‌గా పని చేసి యాదగిరి గత ఏడాది డిసెంబర్‌లో ఉద్యోగ విరమణ చేశాడు.

సుమారు రూ.25 లక్షలు ఉద్యోగ విరమణæ డబ్బులు వచ్చాయి. తనకు తోడు కోసం తెలిసిన వారి ద్వారా పరిచయమైన లలిత (44)ను యాదగిరి గత ఏడాది నవంబర్‌లో ఆర్యసమాజంలో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఇంట్లో కుటుంబ కలహాలు మొదలవ్వడంతో నెల క్రితం భార్య లలితతో కలిసి యాదగిరి దీన్‌దయాళ్‌నగర్‌ రోడ్‌ నంబర్‌–2 ఆర్‌కే ఎన్‌క్లేవ్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఆర్‌కే ఎన్‌క్లేవ్‌కు వచ్చినట్టు భావిస్తున్న కృష్ణప్రసాద్‌ ఇంట్లో ఒంటరిగా ఉన్న సవతితల్లిపై కర్రతో దాడికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేస్తూ ఇంట్లోంచి బయటకు పరుగులు తీసి, ప్రసన్న నిలయం సమీపంలోకి చేరుకుంది. వెంబడించిన కృష్ణప్రసాద్‌ ఆమె తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. నిందితుడు పరారయ్యాడు. మల్కాజిగిరి డీసీపీ రక్షిత కె మూర్తి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు, సీఐ చెప్పారు.

మరిన్ని వార్తలు