గృహిణి దారుణ హత్య

18 Oct, 2019 08:37 IST|Sakshi
బాత్‌రూమ్‌ వద్ద పడి ఉన్న అలేఖ్య మృతదేహం

కడతేర్చిన గుర్తు తెలియని వ్యక్తి..!  

మృతురాలు మర్చంట్‌నేవీ ఉద్యోగి భార్య 

భిన్నకోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు  

మల్కాపురం(విశాఖ పశ్చిమ): పారిశ్రామిక ప్రాంతంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమె ఇంటికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఈ దురాగతానికి పాల్పడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. స్థానికులు, మల్కాపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి ప్రాంతానికి చెందిన సాహుకారి రమేష్‌కుమార్‌ మర్చంట్‌ నేవీలో కొన్నేళ్లుగా పని చేస్తున్నాడు. అతను భార్య సాహుకారి అలేఖ్య(30), ఆరేళ్ల కుమార్తె అనీషా, మూడేళ్ల కుమారుడు తనేశ్వర్‌తో కలిసి 48వ వార్డు ప్రియదర్శిని కాలనీలో కొంత కాలంగా నివాసముంటున్నాడు. ఇటీవల రమేష్‌కుమార్‌ విధులకు వెళ్లాడు. (మర్చంట్‌ నేవీ కావడంతో నెలల తరబడి షిప్‌లోనే విధులు నిర్వర్తిస్తుంటారు.) దీంతో కుమారుడు, కుమార్తెతో అలేఖ్య ఇంటిలో ఉంటోంది. ఈ నేపథ్యంలో అలేఖ్య ఇంటికి బుధవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి వ్యక్తి వచ్చాడు.

ఆ వ్యక్తి అలేఖ్య బంధువా, లేదా మరే ఇతర సంబంధం కలిగిన వ్యక్తా అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. అయితే ఆ వ్యక్తి బుధవారం రాత్రి అంతా వారి ఇంట్లో గడిపాడు. గురువారం ఉదయం పది గంటల వరకు ఇంట్లోనే ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. అనంతరం గురువారం ఉదయం 11 గంటల సమయంలో అలేఖ్య మూడేళ్ల కుమారుడు ఏడుస్తుండడంతో ఎదురు ఇంట్లో ఉంటున్న ఓ వృద్ధురాలు అలేఖ్య ఇంటి తలుపు తట్టి... బాబు ఏడుస్తుంటే ఏం చేస్తున్నావని కేకలు వేసింది. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బాత్‌రూమ్‌ వద్ద పడి ఉన్న అలేఖ్యను చూసి వృద్ధురాలు షాక్‌కు గురైంది. అదుపుతప్పి పడిపోయింది ఏమో అని భావించి ఇరుగుపొరుగు వారిని పిలిచింది. వారు వచ్చి అక్కడ పడిపోయిన అలేఖ్యను మంచం మీద పడుకోబెట్టేందుకు యత్నించగా ఆమె మెడపై తాడుతో బిగించిన ముద్ర ఉండటంతో వెంటనే స్థానిక మహిళా సంఘ ప్రతినిధి రజియాభేగంకు విషయం తెలియజేశారు.

ఆమె మల్కాపురం పోలీసులకు ఫోన్‌లో సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు వచ్చి వివరాలు సేకరించారు. డాగ్‌ స్కాడ్‌ బృందం వచ్చి పరిశీలించింది. అలేఖ్య ఇంటికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ గుర్తు తెలియని వ్యక్తికి, అలేఖ్యకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి..? ఆ సంబంధమే హత్యకు దారి తీసిందా..? లేక మరే ఇతర కారణం వల్లైనా హత్యకు గురైందా..? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. స్థానికుల సహకారంతో గుర్తు తెలియని వ్యక్తి ఊహాచిత్రం గీచేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు మృతురాలు అలేఖ్య ఫోన్‌ లాక్‌ తెరిచి అందులోని సమచారం ఆధారంగా కేసు దర్యాప్తు చేసేందుకు యత్నిస్తున్నారు. ఘటనా స్థలిని ఏసీపీ రామ్మోహన్‌రావు పరిశీలించారు. మల్కాపురం సీఐ ఉదయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు