కొత్త ఫోన్‌.. ఓ ప్రాణాన్ని తీసింది

21 Oct, 2019 16:45 IST|Sakshi

 ఖార్గోన్‌ : మొబైల్‌ ఫోన్‌ మోజు.. ఓ ప్రాణాన్ని హరించింది.  ఇంట్లో ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, ఈ సమయంలో ఖరీదైన ఫోన్‌ ఎందుకని మందలించిన భార్యను దారుణంగా కొట్టి చంపాడో భర్త. ఈ ఘటన మధ్యప్రదేవ్‌లోని ఖార్గోన్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖార్గోని జిల్లాలోని డోమ్వాడ గ్రామానికి చెందిన భోలారం అనే వ్యక్తి భార్య నందుబాయి, ముగ్గురు పిల్లలతో ఓ అద్దె ఇంట్లో కిరాయికి ఉంటున్నాడు. వారి ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇంట్లో తినడానికి తిండి కూడా లేదు. ఇలాంటి సమయంలో భోలారాం ఇంట్లో ఉన్న కొద్దిపాటి డబ్బుతో కొత్త ఫోన్‌ కొంటానని భార్యతో చెప్పాడు. ఇంట్లో పరిస్థితి బాగా లేదని, ఇప్పుడు ఫోన్‌ వద్దని భర్తతో నందు వాదించింది. అయినప్పటికీ భోలారాం వినకుండా ఫోన్‌ కొనేందుకు షోరూమ్‌కు వెళ్లాడు.

దీంతో కలత చెందిన నందు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. సాయంత్రం కొత్త ఫోన్‌తో ఇంటికి తిరిగివచ్చిన భోలారాం..ఇంట్లో భార్య కనిపించకపోయేసరికి అత్తవారింటికి వెళ్లాడు. అక్కడ గొడవ పడి భార్య, పిల్లలను తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. అనంతరం భార్యతో మళ్లీ గొడవకు దిగాడు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఫోన్‌ కొనాల్సిన అవసరమేంటని భర్తను మందలించింది. దీంతో కోపోద్రిక్తుడైన భోలారాం.. నందు తలను గోడకేసి బలంగా గుద్దాడు. దీంతో నందుబాయి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం భోలారాం గట్టిగా ఏడుస్తూ ముగ్గురు పిల్లలను ఇంట్లోనే వదిలి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా